పెట్టుబడుల సదస్సు నిర్వహించడం ఆషామాషీ కాదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నిర్వహించడం. ఎందుకంటే దేశంలో పారిశ్రామికవేత్తలు ఇప్పుడు అధికార పార్టీలతో తప్ప ఆ పార్టీ ప్రత్యర్థులతో కనీసం సన్నిహితంగా ఉండటానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. ఇక పెట్టుబడులు పెట్టే అవకాశాలు అంతంతమాత్రం. కనీసం భేటీలకూ కూడా ముందుకు రారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయం బాగా అర్థమై ఉంటుంది. ఇన్వెస్టర్లను ఆకర్షించడం అంటే.. ఓ కాంగ్రెస్ సీఎంకు రెండు వైపులా పదునున్న కత్తితో ఆడుకోవడమే. దాన్ని ఆయన ఒడుపుగా తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అదాని, అంబానీలు లేకుండా పెట్టుబడుల సదస్సు సాధ్యమా ?
అదాని, అంబానీలు లేకుండా పెట్టుబడుల సదస్సు పరిపూర్ణం కాదు. ఈ రెండు దిగ్గజ సంస్థలతో పాటు ఇతర ప్రముఖ సంస్థలు.. హైదరాబాద్ లాంటి చోట్ల పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తాయి. కానీ ఈ రెండు పారిశ్రామిక సంస్థలు అంటే కాంగ్రెస్ పార్టీకి పడదు. వాటితో ఆ పార్టీ సీఎంలు సన్నిహితంగా ఉన్నా హైకమాండ్ అంగకరించదు. తమ ముఖ్యమంత్రులపై నమ్మకం కోల్పోతారు. అయినా రేవంత్ రెడ్డి హైకమాండ్ కు నచ్చచెప్పుకోగలనన్న ధీమాతో ఆయన వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారు. స్టేట్ ఫస్ట్ నినాదంతో వ్యవహరిస్తున్నారు. ఆ ఫలితమే మొదటి రోజు మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగడం.
అనుభవం లేని సీఎం మరో మైనస్ పాయింట్
రేవంత్ రెడ్డి మొదటి సారి సీఎం అయ్యారు. పారిశ్రామిక వర్గాలతో ఆయనకు ఉన్న పరిచయాలు స్వల్పమే. గత రెండేళ్లుగా తెలంగాణ పాలసీల గురించి విస్తృతంగా ప్రచారం చేసి.. వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఆ ధైర్యంతోనే పెట్టుబడుల సదస్సుకు ప్లాన్ చేశారు. కొత్తగా హైదరాబాద్ లో ఏముందని అనుకునేవారికి.. ఫ్యూచర్ సిటీని చూపిస్తున్నారు.తనకు అనుభవం లేకపోయినా.. పారిశ్రామిక పరంగా తాను ఇచ్చే ప్రోత్సాహకాలు, తన విజన్ చాలా పకడ్బందీగా ఉంటుందని అందరీ తెలిసేలా చేస్తున్నారు.
ఈ సమ్మిట్ ప్రభావం చాలా కాలం ఉంటుంది !
ఈ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో ఇప్పటికిప్పుడు వచ్చే పెట్టుబడులు ఎన్ని అన్న సంగతి పక్కన పెడితే .. ఈ సదస్సు గొప్ప మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి విజన్.. తెలంగాణలో ఉన్న అవకాశాలను పారిశ్రామిక వేత్తల ముందు ఉంచుతారు. ఈ సారి ఎపుడైనా పెట్టుబడులు అని ఏ సంస్థ అయినా ఆలోచిస్తే వారి దృష్టిలోకి తెలంగాణ కూడా వస్తుంది. ఇదే ఈ సదస్సు సాధించే అసలు విజయం. రేవంత్ రెడ్డి.. తెలంగాణకు ఉన్న బలాలను గుర్తించి.. పారిశ్రామిక ఫ్రెండ్లీ వాతావరణంతో .. తనదైన మార్క్ చూపిస్తున్నారని అనుకోవచ్చు.
