ఎనిమిదిన్నరేళ్ల కిందట అమెరికాలోని న్యూజెర్సీలో నర్రా శశికళ అమే మహిళను, ఆమె చిన్న బిడ్డను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆమె నివాసంలోకి చొరబడిన నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. అందరూ ఆమె భర్త నర్రా హనుమంతరావును అనుమానించారు. శశికళ తల్లిదండ్రులు కూడా అదే చెప్పారు. వివాహేతర బంధం కారణంగానే ఈ హత్య చేశాడని ఆరోపించారు. అతనిపై అమెరికా పోలీసులు అన్ని రకాల విచారణలు జరిపారు. కానీ ఆయనపై ఆధారాలు దొరకలేదు. హంతకుడెవరో దొరకకపోవడంతో ఆ నిందను నర్రా హనుమంతరావు మోస్తున్నారు.
అయితే పోలీసులు మాత్రం తమ దర్యాప్తు ఆపలేదు. తమకు లభించిన క్లూలు, హత్యా స్థలంలో నిందితుడికీ గాయాలయినట్లుగా లభించిన రక్తమరకలతో డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. వాటి ద్వారా అనుమానితుల్ని పోల్చి చూడటం ప్రారంభించారు. అయితే నర్రా హనుమంతరావు పని చేస్తున్న కంపెనీలోనే పని చేసే.. హమీద్ అనే భారతీయుడిపై అనుమానం వచ్చింది. కానీ అప్పటికే అతను ఇండియాకు వెళ్లిపోయాడు. కొంతం కాలం శశికళ, హనుమంతరావు, హమీ ఒకే కంపెనీలో పని చేశారు. హనుమంతరావు భార్యను హమీద్ చంపేశాడు. ఆధారాలు దొరకకుండా చేసి .. ఆరు నెలల్లో ఎవరికీ డౌట్ రాకుండా ఇండియాకు పారిపోయాడు.
హమీద్ నుంచి డీఎన్ఏ సేకరించడానికి అమెరికా ఎఫ్బీఐ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ హమీద్ నిరాకరిస్తూ వచ్చాడు. దాంతో ఆయన పని చేసిన కంపెనీ ల్యాప్ ట్యాప్ ను.. ఆ కంపెనీ నుంచి తీసుకుంది ఎఫ్బీఐ. అక్కడ దొరికిన డీఎన్ఏతో విశ్లేషించడంతో సరిగ్గా సరిపోయింది. దాంతో హమీద్ హత్య చేశాడని తేలింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న హమీద్ ను.. తీసుకు వచ్చేందుకు దౌత్యపరమైన ప్రక్రియ ప్రారంభించారు. భార్య బిడ్డలను పోగొట్టుకోవడమే కాకుండా..అనేక అనుమానాలు, అవమానాలు ఎదుర్కొన్న నర్రా హనుమంతరావు ఇప్పుడు రిలీఫ్ ఫీల్ అయి ఉంటారు.

