పంచ మహా ఉగ్రవాద సంస్థలు…

ఉగ్రవాద సంస్థలు కొన్ని మట్టికరచిపోతుంటే, కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఈమధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మహోగ్రదాడులకు పాల్పడుతున్న ఐదు ఉగ్రవాద సంస్థల వివరాలు ఇవి…

ఐఎస్ఐఎస్

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS). ఈ పేరుచెప్పగానే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఏ దేశంలో ఎప్పుడు విరుచుకుపడతారో తెలియని పరిస్థితి. 1999లో ఇరాక్ లో జమాత్ అల్ తాహిద్ వల్ జిహాద్ పేరిట ఈ సంస్థ ఆవిర్భవించింది. ఒకరకంగా చెప్పాలంటే అప్పటికే పేరుమోసిన అల్ ఖైదాకి ఇది అనుబంధ సంస్థగా ఉండేది. అల్ ఖైదాతో చేతులుకలిపిన తర్వాత దీని పేరును అల్ ఖైదా ఇన్ ఇరాక్ గా మార్చుకుంది. 2006లో మరికొన్ని తీవ్రవాద సంస్థలను కలుపుకుని ముజాహిదీన్ షురా కౌన్సిల్ గా మారింది. 2013లో సిరియా అంతర్యుద్ధం నేపథ్యంలో ISISగా రూపాంతరం చెందింది. 2014లో అల్ ఖైదా నుంచి పూర్తిగా తెగతెంపులు చేసుకుని ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించినట్లు ప్రకటించింది. అక్కడితో ఆగలేదు, అబుబకర్ అల్ బగ్ధాదీని ఖాలిఫ్ గా ప్రకటించి తమ ఇస్లామిక్ రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామంటూ `వరల్డ్ మ్యాప్’ ని ప్రకటించింది. పవిత్ర యుద్ధం పేరిట హింసకు పాల్పడుతూ మారణహోమం సృష్టిస్తోంది. ఇప్పటికే, ఇరాక్, సిరియా ప్రాంతాల్లో చాలామటుకు భూభాగం ఇస్లామిక్ రాజ్యం పరిధిలోకి వచ్చినట్లు ప్రకటించుకుంది. ఈ సంస్థకి డబ్బుకు కొదవేలేదు. క్రిందటేడాదే దీనివద్ద 200 కోట్ల డాలర్లకు పైగా నిధులున్నట్లు తెలిసింది. పైగా ఇరాక్ భూభాగంలోని 300 చమురు బావులు ఈ సంస్థ చేతుల్లోకి వచ్చేశాయి. సిరియా చమురు ఉత్పత్తిలో 60శాతం ISIS చేతుల్లోకి వెళ్ళిపోయింది. 2014లో ఆరువేలమంది మరణానికి బాధ్యత తీసుకుంది. ఇరాక్ పౌరుల ఊచకోతలకు తామే కారణమని బాహాటంగా చెప్పింది. సిరియా అంతర్యుద్ధంలో 20వేల మందిని దారుణంగా చంపేసింది. క్రిందటి వారమే విడుదలచేసిన ప్రపంచ ఉగ్రవాద సూచిక (గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ – జిటిఐ)లో అత్యంత క్రూరమైన ఉగ్రవాద సంస్థగా నిలిచింది. తన సంస్థ గురించి ప్రచారం చేసుకోవడంలోనూ, అత్యంత హేయమైన నరమేథ వ్యూహరచనల్లోనూ అందెవేసింది. ప్రస్తుతం ISISకి 30 పైచిలుకు టెర్రరిస్ట్ గ్రూప్ లు అండగా ఉన్నాయి.

బొకొహరమ్

ఇది మరో ఉగ్రవాద సంస్థ. పాశ్చాత్య విద్యను సమూలంగా నిషేధించడమే దీని లక్ష్యం. పాశ్చాత్య విద్య పాపంమన్నదే దీని నినాదం. బొకొ హరమ్ అంటే ఇదే అర్థం వస్తుంది. ఈ ఉగ్రవాద సంస్థ 2002లో ఏర్పాటైంది. దీని ప్రధాన లక్ష్యం నైజీరియాను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే. నైజీరియాలో నరమేథం సృష్టించడంలో తనకుతానేసాటని నిరూపించుకుంది. క్రిందటేడాది మూకుమ్మడి హత్యలకు పాల్పడింది. వందలాదిమంది పాఠశాల బాలికలను కిడ్నాప్ చేసింది. 2014లో 453 దాడులకు పాల్పడింది. 6,644 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదసంస్థగా గుర్తింపు సంపాదించుకుంది. మతంమాటున ఎంతటి దారుణానికైనా తెగబడటం దీని ప్రత్యేకత. బొకొహారమ్ పేరుచెబితేచాలు, నైజీరియన్లకు వణుకు. ఈ ఉగ్రవాద సంస్థ నైజీరియాలో కఠినమైన షిరియా చట్టాన్ని అమలుచేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

అల్ ఖైదా ఇన్ ద అరేబియన్ పెనిన్సుల (AQAP)

యెమెన్, సౌదీ అరేబియాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థ ఇది. అల్ ఖైదా ఈ రెండు దేశాల్లో ఏర్పాటుచేసుకున్న శాఖలే AQAP. 2009లో క్రిస్మస్ పండుగరోజున డెట్రాయిట్ నుంచి బయలుదేరిన విమానాన్ని `అండర్ పాంట్స్ బాంబ్’ ద్వారా కూల్చడానికి ప్రయత్నించి విఫలమైంది. 2010లో విమానాలను కూల్చడంలో మరో రెండుసార్లు ప్రయత్నించింది. దక్షిణ యెమెన్ లో దీని ప్రధాన స్థావరం ఉంది. ఒక దశాబ్దికాలంగా ఈ ఉగ్రవాద సంస్థ అమెరికా డ్రోన్లను నేలకూల్చడమే పనిగా పెట్టుకుంది. గడచిన ఐదేళ్లలో 1200మందిని నిర్దాక్షణ్యంగా చంపేసింది.

అల్ ఖైదా ఇన్ ద ఇస్లామిక్ మాఘెరెబ్ (AQIM)

ఆఫ్రికాలోని ఉత్తర ప్రాంతంలో పాశ్చాత్య నాగరికతను అంతమొందించాలన్న ఉద్దేశంతో సహారా, సాహెల్ స్థావరాలుగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ ఇది. అల్జీరియాలో అంతర్యుద్ధం తలెత్తినప్పుడు ఇస్లాంమత సాయుధదళం నుంచి ఈ సంస్థ పుట్టుకొచ్చింది. ఈ సంస్థలో వెయ్యిమందిదాకా సభ్యులున్నారు. అల్జీరియా, ఛాద్, లిబియా, మాలి, మారిటానియా, నైజీరియా, ట్యూనేసియా ల్లో మద్దతు పెరుగుతోంది. ఇది అల్ ఖైదా నుంచి పుట్టుకొచ్చిన సంస్థే. ఈమధ్య మాలీలో రాడిసన్ బ్లూ హోటల్ పై దాడికి పాల్పడింది కూడా ఈ సంస్థ ఉగ్రవాదులే.

అల్ షాబాబ్

సోమాలియా స్థావరంగా పెరిగిన ఉగ్రవాద సంస్థ ఇది. అరబిక్ భాషలోని ఈ పదానికి అర్థం “the youth” అని. 2013లో కెన్యాలో వెస్ట్ గేట్ షాపింగ్ మాల్ పై దాడిచేసింది ఈ సంస్థే. వైట్ విడోగా పేరుతెచ్చుకున్న సమంత లేత్వయిటే ఈ సంస్థ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఈ సంస్థవద్ద ఏడువేల నుంచి 9వేల మంది ఫైటర్స్ ఉన్నారు. ఇది అల్ ఖైదా కు అనుబంధంగా పనిచేస్తుంటుంది.

పై ఉగ్రవాద సంస్థల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఉగ్రవాదమన్నది ప్రస్తుతం ఏ ఒక్కదేశానికో పరిమితం కాలేదు. పైగా ప్రముఖ ఉగ్రవాద సంస్థలన్నీ ఇస్లాంమతంతో ముడిపడిఉండటం. అల్ ఖైదా అంతమొందిందని భావిస్తున్నా దాని శాఖలు వేరువేరు రూపాల్లో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి. పైకి చూసినప్పుడు వేరువేరుగా ఉన్నప్పటికీ అవసరమైతే ఏకం కావడానికి కూడా వ్యూహరచనలు చేస్తున్నాయి. అంటే ప్రపంచదేశాలు టెర్రర్ పై వార్ ప్రకటించినా తిప్పికొట్టడానికి సిద్ధమవుతున్నాయన్నమాట. ఇదంతా చూస్తుంటే, మూడవ ప్రపంచయుద్ధం టెర్రర్ గ్రూప్ లకూ, లౌకికవాద ప్రపంచదేశాలకూ మధ్య తలెత్తేలా ఉంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com