The Great Pre Wedding Show Movie Review
తెలుగు360 రేటింగ్:2.5/5
ఓ అందమైన బొమ్మ గీయడానికి పెద్ద పెద్ద కాన్వాసులే అక్కర్లెద్దు. చిన్న కాగితం ముక్క చాలు. సినిమాలూ అంతే. ప్రేక్షకుడ్ని అలరించడానికి అద్భుతాలే చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడూ మనవైన, మనదైన, మృదువైన సంగతులు చెబితే సరిపోతుంది. ప్రేక్షకులు కూడా ఎప్పుడూ భారీ హంగులు కోరుకోరు. మామూలు విషయాలు కూడా వాళ్లకు సరదాగా నచ్చేస్తుంటాయి. అష్టాచమ్మా, ఉయ్యాల జంపాల, మొన్నొచ్చిన లిటిల్ హార్ట్స్.. ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలేం చెప్పలేదు. వాటిలో కూడా సింపుల్ కథలే ఉంటాయి. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లో కూడా చాలా చిన్న చిన్న విషయాలే ఉన్నాయి. కానీ అవన్నీ అందంగా అర్థవంతంగా కుదిరాయి. మరి ఆ అందమైన విషయాలేంటి? ఈ వెడ్డింగ్ షూట్ ఎంత వరకూ వినోదాన్ని పంచింది?
అదో పల్లెటూరు. అక్కడో ఫొటో స్టూడియో నడుపుతుంటాడు రమేష్ (తిరువేర్). తనకో బుల్లి అసిస్టెంట్ రాము (రోహన్). ప్రీ వెడ్డింగ్ షూట్లు చేయడంలో దిట్ట. ఊర్లో పొలిటికల్ గా కొద్దో గొప్పో పలుకుబడి ఉన్న ఆనంద్ కు (నరేంద్ర రవి) పెళ్లి కుదురుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమని రమేష్ దగ్గరకు వస్తాడు. లక్షన్నరకు బేరం కుదురుతుంది. రెండ్రోజుల పాటు వెడ్డింగ్ షూట్ జరిపిస్తాడు రమేష్. తీరా ఆ చిప్ రాము చేతికి ఇస్తే… తనెక్కడో పారేస్తాడు. చిప్ లేదని తెలిస్తే, రెండు రోజుల కష్టం బుగ్గిపాలు అయ్యిందని తెలిస్తే ఆనంద్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలిక భయపడిన రమేష్… ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది మిగిలిన కథ.
ఈ కథంతా ట్రైలర్ లోనే చూపించాడు దర్శకుడు. సో.. కథేమిటో థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడికి ముందే ఓ అంచనా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్లిపోయాడు. ఈలోపు కూడా జరిగే తతంగం కూడా సరదా సరదాగా ఉంటుంది. ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ చాలా గమ్మత్తుగా నడుస్తుంది. కొత్త పెళ్లి కొడుకు – పెళ్లి కూతురు చూడ్డానికి చాలా సహజంగా కనిపించారు. దాంతో ఆయా సన్నివేశాలకు మరింత రిలేట్ అవుతాం. `దేవర` స్టెప్పు, ఐస్ క్రీమ్ తినే సీన్.. ఇవన్నీ నవ్విస్తాయి. అలాగని పగలబడి నవ్వుకోం కానీ.. తెరపై ఏ సన్నివేశం చూసినా పెదాలపై చిరు నవ్వు అంటుకొని ఉంటుంది. చిప్ పోయిన దగ్గర్నుంచి టెన్షన్ మొదలవుతుంది. దాన్నుంచి రమేష్ ఎలా బయటపడతాడో అనిపిస్తుంది. ఈలోగా అసిస్టెంట్ రాము చేసే అల్లరి కూడా హాయినిస్తుంది. పెళ్లి ఆపడానికి చేసే ప్రయత్నాలు, అవన్నీ ఫెయిల్ అవ్వడం.. ఇంట్రవెల్ ముందు ఓ ట్విస్టు… ఇదంతా ఫస్టాఫ్ ఎప్పుడు అయ్యిందో అనే ధ్యాస లేకుండా చేస్తాయి.
ఇలాంటి కథల్ని సెకండాఫ్ లో డీల్ చేయడం చాలా కష్టం. అక్కడ కూడా దర్శకుడు సహజత్వాన్నే నమ్ముకొన్నాడు. ఆనంద్ ని ప్రేమలో దింపడానికి హేమ (టీనా శ్యావ్య) చేసే ప్రయత్నాలు కూడా నవ్విస్తూనే ఉంటాయి. కథ రేఖామాత్రంగా ఉన్నా దాన్ని నడపడానికి దర్శకుడు రాసుకొన్న సన్నివేశాల్లో బలం కనిపిస్తుంది. కథంతా ఒకే చోట తిరుగుతున్నా అదేం పెద్ద ఇబ్బందిగా అనిపించదు. ఎప్పుడైతే ప్రధాన పాత్రల్ని ఓన్ చేసుకొంటామో.. అప్పటి నుంచి కథని ఫాలో అయిపోతుంటాం. బండి కాస్త అక్కడక్కడ స్లోగా నడుస్తున్నా `పర్లేదు లే.. ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలు` అని సర్దుకుపోతాం. చివర్లో ఈ కథని సుఖాంతం చేసిన విధానం కూడా బాగుంది. ఇద్దరు తాగుబోతు మగాళ్ల వల్ల ఆగిపోయిన పెళ్లి.. సర్దుకుపోయే ఇద్దరు ఆడవాళ్ల వల్ల మళ్లీ ఎలా పెళ్లి పీటల వరకూ వెళ్లింది అనే సినారియో బాగా డిజైన్ చేశాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ కి అసలైన నిర్వచనం చెప్పాడు.
తిరువీర్ చాలా సహజంగా కనిపించాడు. తన నటన ఆకట్టుకొంటుంది. హీరోలా కాకుండా ఓ పాత్రలా బిహేవ్ చేశాడు. టీనా శ్రావ్య కూడా ఎక్కడా హీరోయిన్లా అనిపించదు. పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. సో.. ఆ పాత్రనీ చాలా ఈజీగా ఓన్ చేసుకొంటాం. నిజానికి ఈ కథలో అసలైన హీరోహీరోయిన్లు కొత్త పెళ్లి జంట. వాళ్ల నటన చాలా బాగా కుదిరింది. నిజంగానే ఓ పెళ్లి జంటని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. వీరనే కాదు.. తెరపై కనిపించే ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రల్లో సహజంగా ఒరిగిపోయారు. 90 వెబ్ సిరీస్ తో ఆకట్టుకొన్న రోహన్ మరోసారి మంచి మార్కులు కొట్టేస్తాడు. తను స్క్రీన్ పై మరికొంత సేపు ఉంటే బాగుండును అనుకొనేలా ఆ పాత్రని తీర్చిదిద్దారు.
ఇంత సింపుల్ పాయింట్ తో రెండు గంటల సినిమా తీయగలం అని నమ్మిన దర్శక నిర్మాతల్ని అభినందించాలి. దర్శకుడికి ఫన్ మీద మంచి పట్టు వుంది. దాన్ని ఇంకా బాగా డీల్ చేయగలడు కూడా. సున్నితమైన అంశాన్ని, ఎక్కడా అసభ్యత లేకుండా, ద్వందార్థాలకు ఆస్కారం లేకుండా తెరకెక్కించిన విధానం బాగుంది. లొకేషన్లు సహజసిద్ధంగా ఉన్నాయి. ఫొటో స్టూడియో కూడా ఊర్లో మనం రెగ్యులర్ గా చూసే స్టూడియోలానే ఉంటుంది తప్ప, బిల్డప్పులు కనిపించవు. పాటలు కథలో, సన్నివేశాల్లో ఇమిడిపోయాయి. నేపథ్య సంగీతం కూల్ గా వుంది. చిన్న సినిమా ఇది. హంగులు అస్సలు లేవు. క్వాలిటీని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కొన్ని కథలు కలిగించవు. అలాంటి సినిమా ఇది. ఈ వారాంతం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే.. కొన్ని సహజమైన నవ్వుల్ని, పాత్రల అమాయకత్వాన్ని, ఆ అమాయకత్వంలో దాగిన వినోదాన్నీ గుండెల్లో నింపుకుని రావొచ్చు.
తెలుగు360 రేటింగ్:2.5/5
