గౌరవం లేని ప్రవర్తనను ఎప్పుడూ ప్రశ్నించాలి, అలాగే ఎదిరించాలని త్రిష పిలుపునిచ్చారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తనపై చేసిన వ్యాఖ్యలపై త్రిష తన లాయర్ ద్వారా ప్రకటన ఇప్పించారు. ఆ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మీడియాలో తన గురించి వస్తున్న అసభ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలను త్రిష తీవ్రంగా ఖండించారు.
త్రిషకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆమె లాయర్ జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. ఆమె ఎల్లప్పుడూ రాజకీయంగా తటస్థ వైఖరినే అవలంబిస్తారని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఆమె ఊహించలేదని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు పబ్లిక్ డిస్కోర్స్లో సంయమనం పాటించాలని హితవు పలికారు. ఒక నటిగా తన వృత్తిపరమైన గుర్తింపును మాత్రమే చూడాలని, వ్యక్తిగత జీవితాన్ని బహిరంగ చర్చలకు వాడుకోకూడదని కోరారు. తనకు సంబంధం లేని విషయాల్లోకి తన పేరును లాగొద్దని త్రిష ఈ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.ట
బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. విజయ్‌కు రాజకీయ అనుభవం లేదని ఎద్దేవా చేస్తూ.. విజయ్ ముందుగా తన ఇల్లు దాటి బయటకు రావాలి.. ముఖ్యంగా త్రిష ఇంటి నుండి బయటపడితేనే ఆయనకు అసలైన రాజకీయ వాస్తవాలు తెలుస్తాయి అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విమర్శల కోసం ఒక మహిళా నటి వ్యక్తిగత జీవితాన్ని లాగడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై తీవ్ర దుమారం రేగినా… నైనార్ నాగేంద్రన్ క్షమాపణ చెప్పలేదు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొస్తున్నారు.
