రివ్యూ : ఫ్యామిలీ, లవ్, ఫన్ , సెంటిమెంట్ చిత్రం ‘అ ఆ’

మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ సినిమా అంటే అటు యూత్ లో, ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులలో మంచి ఆసక్తి వుంటుంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ..’ (అనసూయ రామలింగం ఆనంద్ విహారి) మొదట్నుంచీ టైటిల్ పరంగా, మంచి క్రేజ్ తెచ్చుకుంది. నితిన్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందా? చూద్దాం..

కథ :

అనసూయ రామలింగం (సమంత) ఓ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి. తన తల్లి మహాలక్ష్మి (నదియా) ఇష్టం మేరకే అందరూ నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో తల్లి ప్రవర్తన తో అనసూయకు ఈ జీవితం బోరింగ్‍ అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఓ సారి తండ్రి రామ లింగం (నరేష్) సలహా మేరకు, కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని అనసూయ తన మేనత్త ఇంటికి వెళుతుంది. అక్కడే ఆమెకు బావ ఆనంద్ విహారి (నితిన్) పరిచయమవుతాడు. కొద్దిరోజుల్లోనే అనసూయ, ఆనంద్ విహారికి చాలా దగ్గరవుతుంది. కాగా ఇదే సమయంలో ఆనంద్ విహారి కుటుంబం కొన్ని ఇబ్బందుల్లో పడుతుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆనంద్, పల్లం వెంకన్న (రావు రమేష్) కూతురు నాగవల్లి (అనుపమ)తో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. అంతకు ముందుగానే అనసూయ తల్లి మహాలక్ష్మికి, ఆనంద్ కుటుంబానికి ఏళ్ళుగా వైరం ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అనసూయ, ఆనంద్ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చెప్పుకున్నారా? ఆ ప్రేమ ఫలించిందా? నాగవల్లి తో పెళ్లి జరగాల్సిన ఆనంద్ ఎలా ఎదుర్కున్నాడు? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ :

నితిన్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే కారెక్టర్ ఈ సినిమాలో లిభించింది. అధ్బుత నటన ను ప్రదర్శించాడు. ఒక అప్పర్ మిడిల్ క్లాసు ఫ్యామిలీ లో భరువు, బాధ్యతలు మోయాల్సిన పరిస్థితుల్లోని ఓ యువకుడిగా నితిన్ నటన చాలా బాగుంది. నటిగా సమంత ఈ సినిమాతో తను ఆర్టిస్ట్ గా ఓ మెట్టు ఎక్కిందని చెప్పొచ్చు. అనసూయ గా ఆ పాత్ర ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న ఎమోషన్స్ పండించడంలో సమంత చూపిన ప్రతిభ కట్టిపడేసేలా ఉంది. ఇక రావు రమేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే! తెలుగు సినిమాకు దొరికిన మంచి నటుల్లో ఒకరని చెప్పొచ్చు. హుందాగా కనిపించే పాత్రతో సినిమాకు ఓ స్థాయి తేవాలంటే ఆ పాత్రతో పాటు, అందులో నటించిన నటుడికి కూడా గ్రాఫ్ స్థాయి ని పెంచే విషయం ఉండాలి. ఈ విషయం లో రావు రమేష్ వంద శాతం సక్సెస్ అయ్యాడు. మళయాలి భామ అనుపమ పరమేశ్వరన్ చూడముచ్చటగా ఉంది. స్క్రీన్‍పై అనుపమ కనిపించినప్పుడల్లా సన్నీవేషానికి ఒక అందం వచ్చింది. నరేష్, నదియా, ప్రవీణ్, ఈశ్వరి.. ఇలా అందరూ తమ పాత్ర పరిధిమేర బాగా నటించారు.

సాంకేతిక వర్గం:

సున్నితమైన భావోద్వేగాలను, ప్రేమకథల్లో ఉండే కన్ఫ్యూజన్‍ను చాలా తెలివిగా చెప్పడంలో, గత చిత్రాలలో లాగే త్రివిక్రమ్ చూపిన ప్రతిభనే ఈ సినిమాకు అన్ని విధాలా ఉపయోగ పడింది. ముఖ్యంగా త్రివిక్రమ్‍లోని రచయిత ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరచే స్థాయిలోనే ఉంటాడు. ఒక పూర్తి స్థాయి ప్రేమకథలో, కుటుంబ బంధాలను కలిపి చెప్పడానికి ఏయే అంశాలు అవసరమో వాటన్నింటినీ కలగలిపి త్రివిక్రమ్ చెప్పిన కధనం బాగుంది. లోతైన సంభాషణలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో త్రివిక్రమ్ ఎప్పటికప్పుడు చూపే నేర్పు సినిమా చూస్తున్నంత సేపూ ముచ్చటగొలిపేలా ఉంటుంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ చేసిన మేజిక్ లో క్లైమాక్స్‌లో ఈశ్వరి చెప్పే చిన్న డైలాగ్, ఇంటర్వెల్‍లో సమంత పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు కథను పరిచయం చేయడంలాంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇక మిక్కీ జే మేయర్ అందించిన పాటలన్నీ గత చిత్రాలలో లాగే ఒకే లా ఉండడంతో పాటు సాహిత్యం పరంగా బాగానే వున్నాయి. నటరాజన్ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ఓ స్థాయిని తెచ్చిపెట్టేంత అందంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ అక్కడక్కడా కథ స్థాయికి మించి, అసహజంగా కనిపించాయి. ఇక కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. ఎస్.రాధాకృష్ణ నిర్మాణం లో ఎక్కడ రాజి పడలేదు.

తీర్పు :

‘అ..ఆ..’ సినిమా పది నిమిషాలు పాటు చాలా నెమ్మదిగా సాగుతుంది. స్టార్టింగ్ లో ఎంటిరా బాబు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు కనిపించాయి .మిగతా విషయాల్లో బాగానే ఆకట్టుకుందనే చెప్పాలి. తాను చెప్పాలనుకున్న అంశాన్నే తెలివిగా, త్రివిక్రమ్ అర్థం చేసుకున్న పద్ధతిలోనే ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు త్రివిక్రమ్ చూపిన ప్రతిభ అద్భుతమనే చెప్పాలి. ఇక మొదట్నుంచీ, చివరివరకూ ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలన్నీ నవ్విస్తూనో, కదిలిస్తూనో, ఏదో ఒక భావోద్వేగాన్ని బలంగా స్పృశిస్తూనో సాగుతూ ఆద్యంతం ఒక ప్రయాణం చూసిన అనుభూతిని కలిగిస్తాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్, రావు రమేష్ నేపథ్యంలో సాగే ఉపకథ.. వీటిని హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువగా దర్శకుడి పైన రచయితే డామినేట్ చేయడం చూస్తూంటాం. ఈ సినిమాలోనూ అదే కనిపిస్తుంది. దర్శకుడిగానూ త్రివిక్రమ్ కొన్నిచోట్ల తన ప్రతిభ చూపారు. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లలో త్రివిక్రమ్‍లోని రచయిత, దర్శకుడు పోటీపడి బయటకొచ్చినట్లు కనిపించింది. ఇక పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్‍స్టోరీలోని కన్ఫ్యూజన్‍ చుట్టూనే తిరిగే ఈ సినిమా, మాస్ అంశాలను, హీరోయిజాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా నచ్చక పోవచ్చు.

తెలుగు360.కామ్ రేటింగ్ 3.25/5
బ్యానర్ : హారిక హాసిని క్రియేషన్స్,
నటి నటులు : నితిన్ , సమంతా, అనుపమ పరమేశ్వరన్, నరేష్, రావు రమేష్ ,నదియ ,అనన్య, ప్రవీణ్, ఈశ్వరి తది తరులు
సినిమాటోగ్రఫీ : యన్.నటరాజ సుబ్రహ్మణ్యం,
సంగీతం : మిక్కి .జె మేయర్,
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు ,
నిర్మాణ , నిర్వహణ : పి.డి .వి .ప్రసాద్,
సమర్పణ : మమత,
నిర్మాత : ఎస్ .రాధా కృష్ణ (చిన్న బాబు)
కథ ,స్క్రీన్ ప్లే ,మాటలు ,దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్,
విడుదల తేది : 02.06.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close