తెలంగాణలో మళ్లీ రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరికలపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలను కొత్తగా చేర్చుకుని .. అంతకు ముందు ఉన్న వారితో కలిసి.. సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తూ లేఖ ఇప్పించారు. సాయత్రానికి దానిని ఆమోదించారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీఎల్పీ లేనట్లే. త్వరలో కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తగా చేరిన ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుంటామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

పూర్తి మెజార్టీ ఉన్నా ఫిరాయింపుల్ని ఎందుకు ప్రొత్సహిస్తున్నారు..?

అవసరం ఉన్నా లేకపోయినా… రాజకీయ పార్టీలు వలసల్ని ప్రొత్సహించడం తప్పు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. రాజకీయంగా వలసల్ని గత ఎన్నికల తర్వాత నుంచి ప్రొత్సహిస్తున్నారు. గత ఎన్నికల తర్వాత ఆయన వివిధ పార్టీల నేతల్ని తన పార్టీలో చేర్చుకున్నారు. దానికి ఆయన రెండు కారణాలు చెప్పారు. ఒకటి.. రాజకీయ అస్థిరత లేకుండా చూసుకోవడం. తెలంగాణ తొలి అసెంబ్లీలో కేసీఆర్‌కు 63 సీట్లు వచ్చాయి. 119 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 60. అంటే.. టీఆర్ఎస్ నుంచి 4 ఎమ్మెల్యేలు పార్టీలు మారినా… ప్రభుత్వం పడిపోతోంది. ఇలాంటి సమయంలో.. ఆయన ఎమ్మెల్యేలను ఆకర్షించారు. ప్రభుత్వం కూలిపోతే.. తెలంగాణ వాళ్లకు పరిపారించడం చేతకాదని అంటారని.. అందుకే.. ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నానని ప్రకటించారు. మరో కారణం కూడా చెప్పారు.. అదే.. తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయ పునరేకీకరణ సాధించడం. అన్ని పార్టీల నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటే.. రాజకీయంగా పునరేకీకరణ ఎలా సాధ్యమవుతుందో.. ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ఆ రెండు కారణాలతో.. కేసీఆర్ వలసల్ని ప్రొత్సహించారు. రాజకీయంగా టీఆర్ఎస్‌ను బలమైన స్థితికి చేర్చుకున్నారు.

వలసలకు ప్రజామోదం వచ్చిందా..?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితికి గతంలో చెప్పినట్లు సమర్థించుకోవడానికి రెండు కారణాలు లేవు. ప్రభుత్వానికి ఈ సారి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజకీయ అస్థిరతకు అవకాశమే లేదు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోదని.. కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. అలాంటిది.. ఇప్పుడు అభివృద్ధి కోసం రాజకీయ పునరేకీకరణ కూడా అవసరం లేదు. అయినప్పటికీ.. కేసీఆర్ వలసల్ని ప్రొత్సహిస్తున్నారు. ఎమ్మెల్యేలను తీసుకున్నారంటే.. శాసనసభలో బలం కోసం అనుకుందాం.. కానీ ఎమ్మెల్సీలను తీసుకుని ఏం చేస్తారు..?. ఈ స్థాయిలో కేసీఆర్ వలసల్ని ప్రొత్సహించడానికి కారణం.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలి… తనకు ప్రత్యర్థిగా ఉండకూడదన్న లక్ష్యంతోనే ఇలా చేస్తున్నారు. దీని వల్ల ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి.. తాము ఒక్కరమే అధికారం అనుభవించాలని.. తమకు ఎదురు కూడదని.. అధికారపక్షం భావించడం వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ప్రజలు కూడా.. ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. తాము ఎవరికి ఓటు వేసినా… వాళ్లు ఏ పార్టీలో ఉంటారో తెలియనప్పుడు.. ఓటర్లకు ఓటుపై ఆసక్తి తగ్గిపోతుంది. అదే సమయంలో.. అసలు తాము వేస్తున్న ఓట్లు నిజంగా తాము అనుకున్న వారికే పడుతోందా లేదా.. అన్న చర్చ ప్రారంభమైంది. ఇప్పుడు… వలసలతో.. ప్రజలు.. ఓటుపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుంది.

ఫిరాయింపుల చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారా..?

ఇది ఒక్క టీఆర్ఎస్‌తో ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. అయితే… ఒకరు చేశారని..మరొకరు అంతకు మించి చేసుకుంటూ పోతే ఎలా.? ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్.. కాంగ్రెస్ చేసినట్లు.. చేయాల్సిన అవసరం ఏముంది..?. ఈ విషయంలో ప్రజల్లో కూడా అవగాహన రావాల్సి ఉంది. ఇలా పార్టీ ఫిరాయించిన వారిని తర్వాత ఎన్నికల్లో ఓడించాలి. కానీ.. ప్రజలు మళ్లీ ఓట్లేసి గెలిపిస్తున్నారు. దాంతో వారు తాము పార్టీ ఫిరాయించడాన్ని ప్రజలు హర్షించారని చెప్పి… తమను తాము సమర్థించుకుంటున్నారు. ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం రావాలి. ఫిరాయింపు చట్టం ప్రకారం.. ఏదైనా పార్టీ తరపున ఎన్నికైన వారు.. ఆ పార్టీ విప్ ఉల్లంఘించినా, ఇతర పార్టీలకు మద్దతు పలికినా… స్వచ్చందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నా.. అనర్హతా వేటు వేయాలి. అయితే.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని.. చట్టంలోఉంది. సుప్రీంకోర్టు అనేక సార్లు ఇలా చేసినప్పుడు.. ఆటోమేటిక్‌గా అనర్హతా వేటు పడేలా ఉండాలని సూచనలు చేసింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు .. అలా ఫిరాయించడమే కాదు.. మంత్రులుగా కూడా అయిపోతున్నారు. దీన్ని అధిగమించాలంటే… ఫిరాయింపుల చట్టం మార్పులు చేయాల్సి ఉంది.

ప్రజల్లో చైతన్యం ఎందుకు రావడం లేదు..?

అధికారం మొత్తం స్పీకర్ చేతుల్లో ఉంటోంది. స్పీకర్ అధికార పార్టీకి చెందిన వారై ఉంటారు. చట్టంలో… అనర్హతా పిటిషన్లపై…నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి గడువూ పెట్టలేదు. అలాగే కోర్టులు కూడా.. దీనిపై జోక్యం చేసుకోలేవు. సమీక్ష చేయలేవు. కానీ.. నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం సమీక్ష చేయవచ్చు. ఈ కారమంగా.. స్పీకర్లు నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. ఇద్దరు రాజ్యసభ సభ్యులపై వేటు వేసి.. ఎవరైనా స్పీకర్లు.. అనర్హతా పిటిషన్లు వచ్చినప్పుడు.. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విచిత్రం ఏమిటంటే.. ఆయన చెప్పిన మాటలను.. ఆయన పార్టీకే చెందిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అమలు చేయడం లేదు. దాని వల్ల ఉపయోగం ఏమిటి..? అందుకే సుప్రీంకోర్టు ఓ నిర్దిష్టమైన టైమ్ లిమిట్ పెట్టాలి..? లేకపోతే రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడుతూనే ఉంటాయి. టీఆర్ఎస్‌ ప్రస్తుత వలసల విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.