బీజేపీ కూటమితో పొత్తు అంటూ జరిగిన ప్రచారానికి విజయ్ ఫైనల్గా చెక్ పెట్టారు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చి అందులోనే బీజేపీతో పొత్తులు ఉండవని తేల్చారు. తాను ఫలానా పార్టీకి బి-టీమ్ అని, త్వరలోనే ఏదో ఒక పెద్ద కూటమితో జతకట్టబోతున్నాననే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తనది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన టీమ్ కాదని, కేవలం ప్రజల టీమ్ అని ఆయన చెప్పారు. తనపై బురద చల్లేందుకు ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాలేవీ సాగవని, అందుకే ఇప్పుడు పొత్తుల పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని విజయ్ విమర్శించారు.
లౌకికవాదం, సామాజిక న్యాయం అనే సిద్ధాంతాల విషయంలో తాను ఎప్పటికీ రాజీ పడబోనని విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎవరి కోసమో లేదా దేని కోసమో తన ఆశయాలను పక్కన పెట్టే ప్రసక్తే లేదని, ఈ చర్చలకే తావు లేదని ఆయన తేల్చి చెప్పారు. తమ పార్టీ నాయకత్వంలోనే పాలన సాగాలనే విషయంలో తాము అత్యంత దృఢంగా ఉన్నామని, మొదటి మహాసభలో చెప్పిన మాటకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు. తన అనుచరులు, అభిమానులు ఇలాంటి అబద్ధపు ప్రచారాలను నమ్మి గందరగోళానికి గురికావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తనపై ఎన్ని నిందలు వేసినా దైవకృపతో అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటామనే ధీమాను విజయ్ వ్యక్తం చేశారు. ఆత్మవిశ్వాసంతో ఉండాలని, మంచే జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఏ కూటమితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోరాడి విజయం సాధిస్తామన్న విజయ్ ప్రకటనతో ఇక పొత్తుల టాపిక్ ముగిసినట్లేనని.. తమిళనాడులో త్రిముఖ పోటీ ఖాయమని అనుకోవచ్చు.


