తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ, రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా అగ్ర నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ ఒంటరి పోరాటం చేయాలని తీసుకున్న నిర్ణయం వరుసగా వస్తే సర్వేలతో చర్చనీయాంశం అవుతోంది. ఒకప్పుడు విజయ్‌కాంత్ కూడా పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి సింగిల్ సీటుుకు పరిమితం అయ్యారు. తర్వాత ఆయన పొత్తులు పెట్టుకుని కింగ్ మేకర్ అయ్యారు. ఇప్పుడు విజయ్ గురించి కూడా ఇేదే చర్చ జరుగుతోంది.
ఓట్ల చీలిక డీఎంకేకు వరప్రసాదం
వివిధ సర్వేల ప్రకారం, విజయ్ పార్టీకి ప్రస్తుతం 15 నుండి 20 శాతం వరకు ఓటు బ్యాంకు ఉన్నట్లు తేలుతోంది. అయితే, ఈ ఓట్లు మెజారిటీగా అన్నాడీఎంకే , ఇతర ప్రతిపక్ష పార్టీల నుండి చీలి వస్తున్నవే తప్ప, అధికార డీఎంకే టు బ్యాంకును పెద్దగా ప్రభావితం చేయడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. విజయ్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ప్రతిపక్ష ఓట్లు చీలిపోయి, ముక్కోణపు లేదా చతుర్ముఖ పోటీలో తక్కువ ఓట్ల మెజారిటీతో కూడా డీఎంకే అభ్యర్థులు సులభంగా గెలిచే అవకాశం ఉంది. రాజకీయంగా తన బద్ధ శత్రువు గా ప్రకటించిన డీఎంకేకు, విజయ్ తన నిర్ణయంతో పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు అందుకే వస్తున్నాయి.
బీజేపీతో పొత్తు ఒక తెలివైన అడుగు
తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న డ్రావిడ పక్షాల ఆధిపత్యాన్ని సవాలు చేయాలంటే, బలమైన కూటమి అత్యవసరం. విజయ్ ఒక ప్రజాకర్షక నేత అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం , పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్న అన్నాడీఎంకేతో కలిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహం చేయడం వల్ల రాజకీయంగా మరిన్ని వెసులుబాట్లు లభించే అవకాశం ఉంది. ఈ మూడు శక్తులు ఏకమైతే, డీఎంకే కూటమిని ముఖాముఖి పోరులో ఢీకొట్టడం సులభతరమవుతుంది.
సిద్ధాంతాలు వర్సెస్ ప్రాక్టికల్ పాలిటిక్స్
విజయ్ తన సిద్ధాంత శత్రువుగా బీజేపీని, రాజకీయ విరోధిగా డీఎంకేను ప్రకటించారు. అయితే, రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం ఎప్పుడూ పనిచేస్తుంది. గతంలో ఎంజీఆర్ లేదా జయలలిత వంటి నేతలు కూడా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి వ్యూహాత్మక పొత్తులు పెట్టుకున్నవారే. ఇప్పుడు విజయ్ కూడా పంతాలకు పోకుండా, బీజేపీ , అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకుంటే కింగ్ మేకర్‌గానే కాకుండా, కూటమికి నాయకత్వం వహించి నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు మెరుగుపడతాయి.
కింగ్ విజయ్ అవుతారా.. విజయ్ కాంత్ అవుతారా?
ప్రస్తుతానికి ఏ సర్వే కూడా విజయ్ ఒంటరిగా గెలిచి అధికారం చేపడతారని చెప్పడం లేదు. కేవలం కొన్ని స్థానాల్లో ప్రభావం చూపే స్పాయిలర్ పాత్రకే ఆయన పరిమితం కావచ్చని అంచనాలు ఉన్నాయి. విజయ్ లక్ష్యం కేవలం ఓట్లు రాబట్టడం మాత్రమే కాకుండా, అధికారాన్ని మార్చడమే అయితే.. పొత్తుల విషయంలో ఆయన పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ పెద్దలను మెప్పించి, ఒక బృహత్తర కూటమికి నేతృత్వం వహించడం ద్వారా ఆయన తమిళనాడు రాజకీయాల్లో నిజమైన దళపతిగా నిరూపించుకోవచ్చు. మొండిగా ఇలాగే వెళ్తే.. విజయ్కాంత్లా సాదాసీదా నాయకుడిగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి.
