వ‌ర్మ వెబ్ సిరీస్ : హింస + సెక్స్ + ఉన్మాదం

”న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు”

– ఈ వాక్యం వ‌ర్మ కోస‌మే పుట్టు ఉంటుంది. ఆ మాట‌కొస్తే… ఈ మాట కూడా వ‌ర్మ ముందు సిగ్గు ప‌డుతుంటుంది. వ‌ర్మ స్టైల్ అంత‌. తాను సిగ్గు ప‌డ‌డు. ప్ర‌పంచం అంతా త‌న‌ని చూసి సిగ్గు ప‌డేలా చేస్తాడు. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌.. వ‌ర్మ నుంచి వ‌చ్చిన వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌.  

వ‌ర్మ టేకింగూ, మేకింగు గురించి చెప్పుకొని చెప్పుకొని బుగ్గ‌లు వాయిపోయుంటాయి. వ‌ర్మ బోల్డ్ నెస్ గురించి రాసీ రాసీ చేతులు పీక్కుపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ నోటికీ, ఆ చేతికీ మ‌రోసారి ప‌నిపెట్టాడు. కాక‌పోతే… ఈసారి వ‌ర్మ‌లోని ఉన్మాదాన్ని త‌వ్వి బ‌య‌ట‌కు తీయ‌డానికి.

నువ్వు ఏదైనా చూపించు – కానీ లిమిట్‌లో ఉండు అంటుంది… సినిమా.

అక్క‌డే వ‌ర్మ అరాచ‌కాలు చేసేశాడు.

నువ్వు ఎంతైనా చూపించు.. లిమిట్ లేదు అంటుంది… వెబ్ సిరీస్‌.

ఎందుకంటే ఇక్క‌డ సెన్సార్ లేదు. ఓ వ్య‌వ‌స్థ లేదు. నీకు కావ‌ల్సింది, నీకు అనిపించింది చెప్పేయ్‌.. చూపించేయ్‌.

ఇక వ‌ర్మ ఆగుతాడా..?  ఆ ఉన్మాదం త‌గ్గుద్దా?

‘క‌డ‌ప‌’ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ చూస్తే అదే అనిపిస్తుంది.

కాలు న‌రికే సీన్‌… బ‌హుశా ఇప్ప‌టి వ‌ర‌కూ వెండి తెర‌పై కూడా చూసుండ‌రు.

ఓ మ‌హిళ ***** అనే బూతు తిడుతూ మ‌గాడి మర్మాంగంపై కొట్ట‌డం ఇంకెక్క‌డా క‌నిపించి ఉండ‌దు.

ఇవ‌నేంటి?  ప్ర‌తీ షాట్ ఓ ‘మాన్యుమెంట్‌’.

క‌డ‌ప‌లో, రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్ష‌నిజం గురించి చాలా మంది చెప్పి ఉండొచ్చు. వ‌ర్మ ఈసారి దాన్ని ఓ స్థాయిలో చూపించ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్నాడు. కాక‌పోతే.. వెబ్ సిరీస్‌ని వేదిక చేసుకున్నాడు. ఇక్క‌డున్నంత ‘ఫ్రీ’డ‌మ్.. వెండి తెర‌పై ఉండ‌దు క‌దా??.. అందుకు..

రాయ‌ల సీమ‌లో జ‌నం ఫ్యాక్ష‌నిజం కోసం మాట్లాడుకోవ‌డం లేదు. రాయ‌ల‌సీమ అంటే ఫ్యాక్ష‌నిజం కాదు, ఇంకా చెప్పుకోవ‌డానికి చాలా ఉంది అని మిగిలిన ప్రాంతాల వాసులు న‌మ్ముతున్నారు. మ‌రి వ‌ర్మ ఏం సాధిద్దామ‌ని, ఏం చూపిద్దామ‌ని ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు?

పోనీ రాయ‌ల‌సీమ వాళ్ల‌ని కెలికి, ఫ్యాక్ష‌నిజాన్ని త‌న స్టైల్‌లో చూపిద్దామ‌నే ప్ర‌య‌త్నం అనుకొందా. ఆల్రెడీ ర‌క్త చ‌రిత్ర‌లో చూపించేశాడు క‌దా?  అయినా వ‌ర్మ‌కి త‌న‌వి తీర‌క‌పోవొచ్చు. బూతో, హింసో చూపిస్తే యూ ట్యూబ్‌లో లైకులు, హిట్సూ వ‌స్తాయి. కాక‌పోతే… వెబ్ సిరీస్ కేవ‌లం యూత్‌ని వ‌ర్గాన్ని టార్గెట్ చేసిన మీడియా. అలాంటి యువ‌త‌రానికి ఈ వెబ్ సిరీస్ ద్వారా వ‌ర్మ ఏం చెప్పాల‌నుకున్నాడో తెలీయ‌డం లేదు. జియో పుణ్యాన నెట్ అందిరికీ అందుబాటులో వ‌చ్చింది. ఆరో త‌ర‌గ‌తి పిల్లాడు కూడా చేతిలో సెల్ ఫోన్‌, అందులో ఓ జియో సిమ్‌తో క‌నిపిస్తున్నాడు. అలాంటి వాడికీ ఈ వెస్ సిరీస్ అందుబాటులో ఉన్న‌ట్టే. వాడికి హింస‌, సెక్స్ అవ‌స‌ర‌మా?? 

వ‌ర్మట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైంది ఒక్క‌టే. అత‌ని వికృత చేష్ట‌లు వెండి తెర‌ని వ‌దిలి ఇప్పుడు బుల్లి తెర‌కు పాక‌బోతున్నాయి. వెబ్ సిరీస్‌కి సెన్సార్ ఉండాల్సిందే.. అనే బ‌ల‌మైన వాద‌న బ‌హుశా ఈ వెబ్ సిరీస్ తోనే మొద‌లైతే.. వ‌ర్మ అనుకోకుండా చేసిన గొప్ప ప‌నుల్లో అదే మొద‌టి స్థానంలో ఉంటుంది. ఈ సిరీస్‌కి ల‌క్ష‌లు, కోట్ల‌లో హిట్స్ ప‌డి, అంద‌రూ ఇదే దారిలో న‌డుస్తానంటే.. ఇక ఈ రంగాన్ని వ‌ర్మ‌ని త‌యారు చేసి వ‌దిలిన ఆ దేవుడు కూడా కాపాడ‌లేడు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com