‘అంత‌రిక్షం’ ట్రైల‌ర్ : సైన్స్ ఫిక్ష‌న్ + దేశ‌భ‌క్తి

అంత‌రిక్ష నేప‌థ్యంలో ఓ సినిమా తీయాల‌న్న ఆలోచ‌న తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు రావ‌డ‌మే ఓ గొప్ప శుభ‌ప‌రిణామం. స్పేస్‌, సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌లంటే… అది హాలీవుడ్ వాళ్ల సొత్తు అనుకుని, వాళ్లు తీసిన సినిమాల్ని చూసుకుంటే గ‌డిపేయ‌డ‌మే మార్గం అనుకుంటున్న త‌రుణంలో `అంత‌రిక్షం` వ‌స్తోంది. ఘాజీలాంటి సినిమాతో తెలుగు చిత్ర‌సీమ దృష్టిని ఆక‌ర్షించిన సంక‌ల్ప్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం, `కంచె`లాంటి హృద్య‌మైన చిత్రాల్ని అందించిన నిర్మాణ సంస్థ `అంత‌రిక్షం`ని రూపొందించడంతో ఈ సినిమాపై న‌మ్మ‌కాలు పెరిగాయి. ఇప్పుడు ట్రైల‌ర్ వ‌చ్చింది. ట్రైల‌ర్ చూస్తుంటే.. హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఓ ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. అంత‌రిక్షంలో ఓ భార‌తీయ హ్యూమ‌గామి చేసే సాహ‌సాల స‌మాహారం ఈసినిమా. అటు స్పేస్ సైన్స్‌ని, ఇటు దేశ‌భ‌క్తిని రెండింటినీ మిళితం చేసిన‌ట్టు అనిపిస్తోంది. ప్రాణాల‌కు తెగించిన ఓ భార‌తీయ హ్యూమ‌గామి…. త‌న దేశ ప్ర‌తిష్ట‌ని కాపాడ‌డానికి ఏం చేశాడ‌న్న‌దే ఈ క‌థ‌. అత‌నికో ప్రేమ క‌థ కూడా ఉంది. అన్నిర‌కాల భావోద్వేగాల‌ల్ని మిళితం చేశాడు సంక‌ల్ప్ రెడ్డి. ”ఓడిపోతే ఎలా అని కాదు… గెల‌వ‌డం ఎలా అని ఆలోచించాలి” అంటూ గెలుపు మంత్రం ఉప‌దేశించాడు. హాలీవుడ్ చిత్రాల‌తో పోలిస్తే.. ఈ సినిమా క్వాలిటీ ఎలా ఉంది? గ్రాఫిక్స్ ఎంత బాగున్నాయి? టెక్నికల్‌గా ఏ స్థాయిలో ఉంది? అనే విష‌యాల‌కంటే.. అలాంటి అరుదైన ఆలోచ‌న వ‌చ్చినందుకు చిత్ర‌బృందాన్ని అభినందించాలి. మ‌రి వాళ్ల ప్ర‌య‌త్నం సాకారం అయ్యిందో లేదో తెలియాలంటే.. ఈనెల 21 వ‌ర‌కూ ఎదురుచూడాలి. అంత‌రిక్షం వ‌చ్చేది అప్పుడే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.