గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ..వన భోజనాల్లో సొంత పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. గురజాల నియోజకవర్గంలో జరిగిన ఓ వనమహోత్సవంలో పాల్గోన్న మోదుగుల తెలుగుదేశంలో తన పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పుకున్నారు. అసలు టీడీపీలోనే రెడ్ల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు కానీ.. టీడీపీ తరపున అని మాత్రం చెప్పలేదు. గురజాల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన సామాజిక వర్గం అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిందిగా కోరారు. వైఎస్ ను పొగుడుతూ.. రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలన్నారు. ఈ వీడియోను వనభోజనాల్లో పాల్గొన్న వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరడం కలకలంర రేపుతోంది. తెలుగుదేశంపార్టీ మోదుగులకు ఏం తక్కువ అయిందన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. వైసీపీ నేతలతో దగ్గర బంధుత్వాలు ఉన్నాయని తెలిసి కూడా.చంద్రబాబు.. గత ఎన్నికల్లో మోదుగులకు గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఇచ్చారు. ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. టీడీపీలో ఎవర్నీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో.. ఆయనకు నియోజకవర్గంలోనే వ్యతిరేకత ప్రారంభమయింది.
మోదుగుల కొద్ది రోజులుగా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది అదే సమయంలో.. చంద్రబాబు 40 మంది సిట్టింగ్ లకు టిక్కెట్ లేదని చెబుతున్నారు. వారిలో మోదుగల ఒకరని టీడీపీ వర్గాుల చెబుతున్నాయి. దీంతో టీడీపీ తనకు టిక్కెట్ ఇస్తుందో, లేదోనని ఎమ్మెల్యే మోదుగుల ఆందోళనలో ఉన్నారు. వన సమారాధనలో చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన పార్టీలో ఉండే యోచనలో లేరనే విషయం స్పష్టవుతోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గురజాలలో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునివ్వడం ద్వారా.. ఆ పార్టీ వైపే చూస్తున్నారని భావిస్తున్నారు. వైరల్ అయిన వీడియోపై ఆయన మౌనం పాటిస్తున్నారు. మీడియా ప్రతినిధులు అడిగినా స్పందించడం మానేశారు.