విజయ్ దేవరకొండ – రష్మిక ప్రేమలో పడ్డారు, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్నది బహిరంగ రహస్యమే. కొన్నేళ్లుగా వీళ్ల ప్రేమ కథ నడుస్తోంది. అయితే మీడియా ముందుకు ఎప్పుడొచ్చినా… ఈ ప్రశ్నని ఎవాయిడ్ చేస్తూనే వచ్చారు. ‘పెళ్లెప్పుడు’ అని అడిగితే ముసి ముసి నవ్వులు నవ్వారు. సెలబ్రెటీ షోలో హోస్ట్ లు కొన్ని హింట్లు ఇచ్చి, సమాధానం రాబట్టడానికి ప్రయత్నించారు. కానీ అప్పుడూ వాళ్ల నవ్వులే సమాధానాలుగా మిగిలాయి. పెళ్లి అనేది వాళ్ల వ్యక్తిగత విషయం. చెబుతారా, లేదా? చెబితే ఎప్పుడు చెబుతారు? అనేది పూర్తిగా వాళ్ల నిర్ణయం, స్వేచ్చ పై ఆధారపడి ఉన్న విషయాలు.
అయితే వీరిద్దరి పెళ్లి ఇప్పుడు ఖాయమైపోయింది. ఈనెల 26న ఉదయ్ పూర్ లో పెళ్లి. మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్. విజయ్ పెళ్లి పిలుపులు మొదలెట్టేశాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెళ్లికి ఆహ్వానించాడు. ఇప్పుడు పెళ్లి పత్రిక కూడా బయటకు వచ్చేసింది. ఇంత జరుగుతున్నా.. ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. రష్మికకు ఫొటోగ్రాఫర్లు ‘కంగ్రాట్స్’ చెబితే.. ‘ఎందుకూ… ఏమైందని’` అమాయకంగా అడుగుతోంది. అంటే పెళ్లి రోజు వరకూ ఇద్దరూ దాగుడుమూతలాట ఆడాలనే ఫిక్సయ్యారన్నమాట.
నిజానికి గతంలోనే విజయ్ – రష్మికల నిశ్చితార్థం కూడా జరిగింది. అప్పుడు కూడా ఇలా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అప్పుడే.. ఇద్దరూ అధికారికంగా ప్రకటిస్తారనుకొన్నారు. కానీ… అది జరగలేదు. పెళ్లికి ఇంకా పది రోజుల సమయం కూడా లేదు. ఇప్పటికీ ఇద్దరూ మౌనంగా ఉండడం ఆశ్చర్యమే. బహుశా ఒకట్రెండు రోజుల్లో వీరిద్దరి పెళ్లి కబురు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేసుకొన్నారేమో. అందుకే ఇంత మౌనం.
