తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ, దళపతి విజయ్ తన వ్యూహాలకు పదును పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి శక్తిని వృథా చేసుకోవడం కంటే, స్ట్రైక్ రేట్ పెంచడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అత్యంత ప్రాధాన్యత కలిగిన 20 నుంచి 25 నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని, అక్కడ గెలుపే లక్ష్యంగా మిషన్ 20 అనే సైలెంట్ ఆపరేషన్‌ను షురూ చేశారు. ఈ వ్యూహాత్మక మార్పు ఇప్పుడు అధికార డీఎంకేతో పాటు ప్రధాన పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది.
డీఎంకే కోటలో దళపతి గర్జన
ముఖ్యంగా చెన్నై శివారుతో పాటు ఉత్తర తమిళనాడు ప్రాంతంలో విజయ్ పర్యటనలకు వస్తున్న జనసందోహం టీవీకే పార్టీని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు డీఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతాల్లో విజయ్ రోడ్ షోలకు యువత, మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం సినిమా గ్లామర్ కోసమే వస్తున్నారా? లేక ఓటు వేయడానికా? అనే సందిగ్ధంలో ఉన్న ప్రత్యర్థులకు, విజయ్ తన ప్రసంగాల ద్వారా స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు. మేము ఓట్లు చీల్చడానికి రాలేదు.. శాసనసభలో అడుగుపెట్టడానికి వచ్చాం అంటూ ఆయన చేస్తున్న గంభీర ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఓటర్లను బాగా ప్రభావితం చేస్తున్నాయి.
టార్గెట్ ఉత్తర తమిళనాడు
విజయ్ కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, తమ పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో మైక్రో లెవల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఎంపిక చేసిన ఈ 20-25 నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు, స్థానిక సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అక్కడ బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా అసెంబ్లీలోకి గౌరవప్రదమైన సంఖ్యతో అడుగుపెట్టాలని ప్లాన్ చేశారు. ఉత్తర తమిళనాడులో డీఎంకే ఓట్ బ్యాంక్‌కు గండికొట్టగలిగితే, కింగ్ మేకర్ పాత్ర పోషించవచ్చనేది దళపతి ఆలోచనగా కనిపిస్తోంది.
తటస్థ ఓటర్లే TVK ఆయుధం
సాంప్రదాయ పార్టీల పట్ల అసహనంతో ఉన్న తటస్థ ఓటర్లను, మొదటిసారి ఓటు వేస్తున్న యువతను విజయ్ తన వైపు తిప్పుకుంటున్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న మధ్యతరగతి వర్గాల్లో విజయ్ తనపై నమ్మకాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి, కేవలం గెలిచే స్థానాలపైనే దృష్టి పెట్టడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. అదే సమయంలో తెలివైన వ్యూహంగా భావిస్తున్నారు. పూర్తిగా గెలవలేమని తెలిసినప్పుడు కింగ్ మేకర్ అయ్యేలాసీట్లు తెచ్చుకుంటే..కింగ్ కూడా కావొచ్చు. ఇప్పుడు ఆ సీట్లు తెచ్చుకోవడమే విజయ్ టార్గెట్.
