నారా చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. లక్షలాది మంది తెలుగు గుండెలకు ఒక భరోసా. ఆయన పాలనలో కంప్యూటర్ కనిపిస్తుంది, అభివృద్ధి వినిపిస్తుంది, కానీ అన్నింటికీ మించి ఆ హృదయంలో ఒక ఆర్తి ఉంటుంది. అదే పేదల సేవ . తన పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏ దారి తెలియని పేదల కన్నీళ్లు తుడిచింది. పుట్టినరోజు నాడు రూ. 56 కోట్ల సీఎం సహాయ నిధి ఫైలుపై ఆయన చేసిన సంతకం, వేలాది నిరుపేద ఇళ్లలో వెలుగులు నింపింది.
ఆసరా కావాల్సిన వారికి అండ
చంద్రబాబు వ్యక్తిత్వంలో ఒక గొప్పతనం ఉంది. ప్రపంచ స్థాయి నగరాలు కడుతున్నా, విదేశీ పెట్టుబడులు తెస్తున్నా.. ఆయన కళ్లు ఎప్పుడూ కుగ్రామంలో ఉన్న సామాన్యుడి కోసమే వెతుకుతుంటాయి. గత 22 నెలల్లో ఏకంగా రూ.1,298 కోట్ల ఆర్థిక సాయాన్ని కేవలం CMRF ద్వారా అందించడం సామాన్యమైన విషయం కాదు. ఇది కేవలం ఒక అంకె కాదు.. చావు అంచున ఉన్న వేలాది మంది ప్రాణాలను నిలబెట్టిన సంకల్పం. తన పుట్టినరోజును కూడా ఒక బాధ్యతగా మలుచుకోవడం ఆయనకే సాధ్యం.
ఎన్ని పనులున్నా సీఎంఆర్ఎఫ్ సాయం కోసం సమయం కేటాయింపు
ఒక వైపు రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ, మరోవైపు ఆపదలో ఉన్న పేదవాడు లేఖ రాస్తే చాలు.. అర్ధరాత్రి అయినా సరే స్పందించే గొప్ప గుణం ఆయనది. గుండె జబ్బుతో బాధపడే చిన్నారి అయినా, క్యాన్సర్ మహమ్మారితో పోరాడే వృద్ధుడైనా.. నా వెనుక బాబు ఉన్నాడు అనే నమ్మకం నేడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ పేదవాడిలో కనిపించేలా చేసేలా బాధ్యత వహిస్తారు. పేదవాడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదని ఆయన నమ్ముతారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగులు కట్టడం కాదు, ఒక పేదవాడిని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నిలబెట్టడమే అసలైన విజయం అని ఆయన ప్రతి నిత్యం చాటిచెబుతున్నారు.
చంద్రబాబునాయుడు ఓ భరోసా!
ఆయన పుట్టినరోజున రాష్ట్రమంతటా సంబరాలు జరగడం వెనుక ఉన్నది రాజకీయ అభిమానం కాదు, అది ఆయన ద్వారా లబ్ధి పొందిన వేలాది కుటుంబాల కృతజ్ఞతా భావం. నాయకుడు అంటే దారి చూపడమే కాదు, ఆ దారిలో నడుస్తున్నప్పుడు అలసిపోయిన వాడిని భుజాన వేసుకుని నడిపించేవాడు. చంద్రబాబు గారు సరిగ్గా అదే చేస్తున్నారు. విజన్ ఉన్న పాలకుడిగా ప్రపంచానికి తెలిసినా, కరుణ ఉన్న ఆపద్బాంధవుడిగా పేదవాడి గుండెల్లో ఆయన స్థానం సుస్థిరం. అందుకే అంటారు.. చంద్రబాబు నాయుడు కేవలం ఒక పేరు కాదు, అది ఒక భరోసా!
