చేర‌డానికీ లాక్కోడానికీ ఉన్న‌ తేడాపై మాట్లాడ‌ని విజ‌య‌సాయి!

వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మ‌రోసారి వ‌రుస ట్వీట్లు చేస్తూ విమ‌ర్శ‌లు చేశారు! ఒక ట్వీట్ లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై స్పందిస్తూ… ఆయ‌న పాల‌న‌కు అంతిమ ఘ‌డియ‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ట్టుగా ఉంద‌న్నారు. అమ‌రావతి బాండ్లు కొనుగోలు చేసిన వారి వివ‌రాల‌ను ర‌హ‌స్యం పేరుతో గోప్యంగా ఉంచాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్నారు. అమ‌రావ‌తి బాండ్లు కొన్న టాప్ టెన్ జాబితాలో చంద్ర‌బాబు నాయుడు బినామీలే ఉన్నార‌ని ఆరోపించారు. మ‌రో ట్వీట్ లో మంత్రి నారా లోకేష్ మీద విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి నిన్న లోకేష్ మాట్లాడిన సంగ‌తి తెలిసిందే.

వాటిని ప్ర‌స్థావిస్తూ… తెలుగుదేశం ఎమ్మెల్యేల‌ను కేసీఆర్ లాక్కున్నారా, మ‌రి ఆంధ్రాలో మీరూ మీ తండ్రిగారు చేసిందేంట‌ని ప్ర‌శ్నించారు. వైకాపా టిక్కెట్ల‌పై గెలిచిన‌వారిని ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేసి కొనుగోలు చేశార‌నీ, వారిలో ఎంత‌మందిని ఎలా మంత్రులు చేశారో చెప్పాలన్నారు విజ‌య‌సాయి రెడ్డి. ఆ వివ‌రాల‌ను కూడా లోకేష్ తెలియ‌జేస్తే ఆంధ్రా ప్ర‌జ‌లు చంద్ర‌బాబు నాయుడు ఆవేద‌న‌ను అర్థం చేసుకుంటారంటూ ఎద్దేవా చేశారు.

ఒక పార్టీ టిక్కెట్ తో గెలిచిన ఎమ్మెల్యేల‌ను… ఆ ప‌ద‌వికి రాజీనామాలు చేయించ‌కుండా చేర్చుకోవ‌డం స‌మ‌ర్థ‌నీయం కాదు. కానీ, విజ‌య‌సాయి వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఒక విష‌యం స్ప‌ష్టంగా తెలుసుకోవాలి! తెలంగాణ‌లో టీడీపీ ఎమ్మెల్యేలను తెరాస ఆక‌ర్షించింది. తెరాస‌వైపు టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లార‌నేదీ అంద‌రికీ తెలిసిన కార‌ణ‌మే… రాజకీయ భ‌విష్యత్తుపై భ‌రోసా కోస‌మే! అయితే, టీడీపీకి దూర‌మైన తెలంగాణ నేతలెవ్వ‌రూ… వెళ్తూ వెళ్తూ ఆ పార్టీని విమ‌ర్శించిన దాఖ‌లాలు లేవు. తెలంగాణ‌లో ఏర్ప‌డ్డ త‌రువాత‌ ప్ర‌త్యేక రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా మాత్ర‌మే టీడీపీని విడిచి వెళ్లాల్సి వ‌స్తోంద‌నే అన్నారు. అంతేగానీ… పార్టీ అధినాయ‌క‌త్వం తీరుపైగానీ, అధినేత‌పైగానీ విమ‌ర్శ‌లు చెయ్యలేదు. కానీ, ఏపీలో టీడీపీలోకి చేరిన వైకాపా నేత‌ల ప‌రిస్థితి ఏంటి..? జ‌గన్ తీరు భ‌రించ‌లేకే వైకాపాని వ‌దిలేయాల్సి వ‌చ్చింద‌నీ నిన్న‌టికి నిన్నే ఆదినారాయ‌ణ రెడ్డి చెప్పారు.

ఆయ‌న‌కొక్క‌రే కాదు… వైకాపాకి దూర‌మైన ప్ర‌తీ ఎమ్మెల్యే చెప్పిన మాట ఒక్క‌టే… జ‌గ‌న్ తీరుతో విసిగిపోయామ‌నీ, పార్టీలో త‌మ అభిప్రాయాల‌కి ఏమాత్రం విలువ ఉండ‌ద‌నే క‌దా. ఇలాంటి ప‌రిస్థితుల్లో పార్టీకి దూర‌మ‌య్యార‌న్నారు. సో… విజ‌య‌సాయి చెప్పినట్టుగా… తెలంగాణ‌లో టీడీపీ ఎమ్మెల్యేల‌ను తెరాస లాక్కుందేమోగానీ, ఆంధ్రాలో మాత్రం వైకాపా నేత‌లు ఆ పార్టీకి దూర‌మై టీడీపీలో చేరారు. అంటే, ఇక్క‌డ టీడీపీ ప్ర‌య‌త్నం లేద‌ని ఎవ్వ‌రూ అన‌రు! వైకాపాలో ఉన్న అనిశ్చితిని టీడీపీ అడ్వాంటేజ్ గా మార్చుకుంద‌న‌డంలో సందేహం లేదు. వైకాపాను నాయ‌కులు ఎందుకు పార్టీని విడిచి వెళ్లిపోయార‌నేదానిపై ఆ పార్టీ అధినేత‌గానీ, విమ‌ర్శ‌లు చేస్తున్న విజ‌య‌సాయిగానీ ఇప్ప‌టికీ విశ్లేషించుకుంటున్న‌ట్టు లేదు. ఎంత‌సేపూ ఇత‌రుల‌పై బుర‌దచ‌ల్లే కార్య‌క్ర‌మంలో నిమ‌గ్న‌మై మాత్ర‌మే ఉంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com