గతంలో విలాసవంతమైన ఇల్లు అంటే కేవలం ఖరీదైన ఇటాలియన్ మార్బుల్స్, విదేశీ షాండ్లియర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మాత్రమే అనే అభిప్రాయం ఉండేది. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. లగ్జరీ కంటే తమ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వెల్నెస్-లెడ్ ఆర్కిటెక్చర్ వైపు సంపన్న వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. పచ్చని వాతావరణం, సహజసిద్ధమైన వెలుతురు, స్వచ్ఛమైన గాలి లభించేలా డిజైన్ చేసిన ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది.
ఈ కొత్త ట్రెండ్‌లో భాగంగా బయోఫిలిక్ డిజైన్ ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే మనిషికి, ప్రకృతికి మధ్య అనుబంధాన్ని పెంచేలా ఇంటి నిర్మాణం ఉంటుంది. గదుల్లోకి ధారాళంగా సూర్యరశ్మి వచ్చేలా పెద్ద కిటికీలు, ఇండోర్ ప్లాంట్స్ కోసం ప్రత్యేక స్థలాలు, బాల్కనీల్లోనే చిన్నపాటి తోటలను ఏర్పాటు చేయడం వంటివి ప్రధాన ఆకర్షణలుగా మారుతున్నాయి. కాంక్రీట్ వనాల మధ్య నివసిస్తున్నప్పటికీ, ఇంటి లోపలికి అడుగుపెట్టగానే ఒక ప్రశాంతమైన అటవీ వాతావరణం లేదా ఉద్యానవన అనుభూతి కలగాలని నేటి కొనుగోలుదారులు ఆశిస్తున్నారు.
కమ్యూనిటీ వసతులలో కూడా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. కేవలం స్విమ్మింగ్ పూల్, జిమ్ మాత్రమే కాకుండా.. ధ్యాన కేంద్రాలు , యోగా డెక్స్, ఆక్సిజన్ పార్కులు , రసాయన రహిత సేంద్రీయ తోటల పెంపకానికి బిల్డర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేలా, ఇంటి పరిసరాల్లోనే ప్రశాంతతను వెతుక్కునే ఈ సంస్కృతి రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ఒక కొత్త దిశగా నడిపిస్తోంది. సంపన్న వర్గాల దృష్టిలో ఇప్పుడు హెల్త్ ఈజ్ ద రియల్ వెల్త్ అనే సూత్రం ఇళ్ల కొనుగోలులో ప్రధాన భూమిక పోషిస్తోందని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి.
