పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలకు అగ్రరాజ్యం అమెరికా అనూహ్యంగా బ్రేక్ వేసింది. గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో సాగుతున్న చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని వెల్లడించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఇంధన వనరులపై జరపాల్సిన సైనిక దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేయాలని తన రక్షణ శాఖను ఆదేశించారు. శత్రుత్వానికి స్వస్తి పలికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొనడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలను కొంతమేర తగ్గించింది.
ఇప్పుడు అందరి దృష్టి ఇజ్రాయెల్ వైఖరిపైనే ఉంది. అమెరికా ఐదు రోజుల గడువు ఇచ్చినప్పటికీ, ఇజ్రాయెల్ తన సొంత భద్రతా ప్రయోజనాల దృష్ట్యా దాడులను పూర్తిగా ఆపేస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సాధారణంగా ఇరాన్ అణు కార్యక్రమాలు లేదా క్షిపణి కేంద్రాల విషయంలో ఇజ్రాయెల్ రాజీపడదు. ఒకవేళ అమెరికా ఒత్తిడితో ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గితే, అది పశ్చిమాసియా రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపు అవుతుంది. లేనిపక్షంలో అమెరికా చర్చలు సాగిస్తున్నా ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తే అది ట్రంప్ దౌత్యానికి పెద్ద సవాలుగా మారుతుంది.
ఇరాన్‌కు ఐదు రోజుల సమయం ఇవ్వడం ద్వారా, ఆ దేశం తన పద్ధతి మార్చుకోకపోతే మరింత తీవ్రమైన దాడులు ఉంటాయనే హెచ్చరికను కూడా ఆయన పంపారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో ట్రంప్‌కు ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా, ఇరాన్ ఒక మెట్టు దిగివస్తేనే ఇజ్రాయెల్ తన దూకుడును తగ్గించే అవకాశం ఉంది. ఈ లోపే ఇరు దేశాల మధ్య రహస్య ఒప్పందాలు ఏమైనా కుదిరాయా అన్న విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.
ప్రస్తుతానికి ఈ ఐదు రోజుల విరామం ప్రపంచ మార్కెట్లకు, ముఖ్యంగా చమురు సరఫరాకు పెద్ద ఊరట. కానీ, ఈ గడువు ముగిసిన తర్వాత ఇరాన్ తన పంతాన్ని వీడకుంటే, అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ కలిసి మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.అలాంటి పరిస్థితి రాదని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.
