యుద్ధ భయంతో వణికిపోతున్న పాకిస్తాన్ ఎదురుదాడులు చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కానీ తేడా వస్తే పాకిస్తాన్ మళ్లీ మిలటరీ పాలనలోకి పోతుందని అక్కడి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే భారత్ నాయకత్వంతో రహస్య చర్చలు ప్రారంభించిటన్లుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్. ఆయన పోటీ చేయలేని పరిస్థితి ఉండటంతో సోదరుడ్ని ప్రధానమంత్రిని చేశారు. ఇప్పుడు భారత్, పాక్ ఉద్రిక్తతలు తగ్గించడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మసూద్ అజర్, హాఫిజ్ సయీద్లో భారత్ లో చాలా కుట్రలు చేసినందున వారిని అప్పగిస్తే సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుందని భారత వర్గాలు పాకిస్తాన్ కు సమాచారం ఇచ్చాయి. నవాజ్ షరీఫ్ ఈ అంశంలో మధ్యవర్తులతో చర్చలు ప్రారంభించారని అంటున్నారు. భారత్ తో ఉద్రిక్తతలను పెంచుకునే చర్యలు వద్దే వద్దని నవాజ్ అంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల్ని అప్పగిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.
హఫీజ్ సయీద్ పాకిస్తాన్ జైల్లో ఉన్నారు. అక్కడా ఆయనపై చాలా కేసులు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ జైలు పేరుతో ఆయనకు రాజభోగాలు కల్పించి ఉగ్రవాద వ్యవహారాలు నడుపుకునేందుకు అవకాసం కల్పిస్తోంది. మసూద్ అజర్ కూడా అలాగే ఉన్నారు. వీరిద్దరూ అధికారికంగా పాకిస్తాన్ లోనే ఉన్నారని స్పష్టమయింది. అందుకే వీరి అప్పగింత వ్యవహారం ఓ కొలిక్కి వస్తే.. పరిస్థితి పూర్తిగా సద్దుమణుగుతుంది.
కానీ పాకిస్తాన్ ఆర్మీ తమ పరువుగా భావించే టెర్రరిస్టులు హాఫిజ్ సయీద్ , మసూద్ అజర్. ఇప్పుడు వారి కోసమే దేశాన్ని పణంగా పెట్టేందుకు సిద్ధమయింది. మరి వారి అప్పగింతకు పాకిస్తాన్ ఒప్పుకుంటుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. దేశం ముఖ్యమా.. ఉగ్రవాదం ముఖ్యమా అన్న దాంట్లో పాకిస్తాన్ ఆర్మీకి ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది. వారు దేశాన్ని రక్షించడం అనే పని ఎప్పుడో మానేసి.. ఉగ్రవాద సంరక్షకులుగా మారి దేశానికి ముప్పు తెస్తున్నారు.