మహిళా రిజర్వేషన్లను వేగంగా అమలు చేసేందుకు గతంలో చేసిన చట్టానికి సవరణ చేసేందుకు కేంద్రం రెడీ అయింది. 16 నుంచి 18 వరకూ మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు. అయితే ఈ సమావేశాల టైమింగ్ మాత్రం బీజేపీ ఎన్నికల రాజకీయాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో నిరూపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏప్రిల్ 19 నుంచి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. సరిగ్గా అంతకు మూడు రోజుల ముందు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ పెట్టడం ద్వారా.. మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
మహిళా సాధికారత అంశంపై ఏ పార్టీ కూడా బాహాటంగా వ్యతిరేకత వ్యక్తం చేయలేని పరిస్థితిని కల్పించడం ద్వారా, విపక్షాలను ఇరకాటంలో నెట్టే వ్యూహం ఇది.
విపక్షాల ముందున్న చాయిస్ ఏంటి?
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో సమావేశాలు నిర్వహించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ, వారికి ప్రత్యామ్నాయం లేదు. మహిళా రిజర్వేషన్ వంటి అత్యంత సున్నితమైన , ప్రజాదరణ ఉన్న బిల్లును వ్యతిరేకిస్తే మహిళా వ్యతిరేకి అనే ముద్ర పడుతుందనే భయం ప్రతిపక్షాల్లో ఉంది. అందుకే, ఈ సమయం సరైనది కాదని వాదించినా, చివరకు సభకు హాజరుకాక తప్పని పరిస్థితి. ఎన్నికల తర్వాత మే 4 వరకు ఆగాలని విపక్షాలు డిమాండ్ చేసినా, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కనిపించడం లేదు.
ముఖ్యమైన సమస్యల నుంచి డైవర్షన్
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు ధరలు , ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావాన్ని
చూపుతున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం, పెరుగుతున్న ధరల వంటి అంశాలు చర్చకు రాకుండా ఉండటానికే ప్రభుత్వం ఇటువంటి డైవర్షన్ టాపిక్స్ ను తెరపైకి తెస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక విపత్తు గురించి ప్రజలు ఆలోచించే లోపే, మహిళా రిజర్వేషన్ వంటి సెంటిమెంట్ అంశాలతో వారి దృష్టిని మళ్లించడం రాజకీయ చదరంగంలో ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది.
అందరూ ఆమోదించక తప్పని పరిస్థితి
ప్రస్తుత పరిస్థితుల్లో అంతా రాజకీయమే అన్న చందంగా.. ఏ నిర్ణయమైనా కేవలం ఎన్నికల లాభనష్టాల కోణంలోనే జరుగుతోందనేది స్పష్టమవుతోంది. అభివృద్ధి, ఆర్థిక సమస్యల కంటే రాజకీయ నరేటివ్ లకే ప్రాధాన్యత లభిస్తున్న తరుణంలో, పార్లమెంట్ సమావేశాలు కేవలం ఒక లాంఛనంగా మారుతున్నాయన్న ఆందోళన ప్రజాస్వామ్యవాదుల్లో వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 16 నుంచి జరిగే మూడు రోజుల హడావుడి చివరకు ఓటర్ల తీర్పును ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.
