ఉత్తమ నటుడు మోదీ

ఒక గొప్ప నాయకుడిలో ఒక మంచి నటుడు కూడా ఉన్నాడు. అతను అప్పుడప్పుడూ తొంగిచూస్తుంటాడు. అంతవరకూ ఫర్వాలేదు. కానీ అదే నాయకుడు తెర వెనక్కి వెళ్ళిపోయి, చివరకు నటుడే విశ్వరూపం చూపిస్తే దాని వల్ల కలిగే అనర్థాలేమిటి? మోదీలోని భావోద్వేగాలు దేశానికి మంచి చేస్తాయా? చెరుపు చేస్తాయా? అయోధ్య రాముడి నుంచి మోదీ నేర్చుకున్న పాఠం ఏమిటీ?

కాలిఫోర్నియాలో భారతప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంతో చేసిన ప్రసంగం విన్నవాళ్లు, చూసినవాళ్లు ఎంతో కొంత చలించిపోయే ఉంటారు. మోదీకి సరిగా కావాల్సింది అదే. ఈ విషయంలో ఆయన విజయం సాధించారు. ఒక హాలీవుడ్ చిత్రంలో హీరోకంటే ఎంతో చక్కటి భావప్రకటన చేసినందుకు జేజేలు పలికారు. నాయకుడన్న వాడిలో నటుడు జోడైతే విశ్వనాయకునిగా ఎదగవచ్చని మోదీ పూర్తిగా నమ్ముతున్నారు.

ఒక మంచి హీరో తనకిచ్చిన పాత్రలో బాగాలీనమైపోతారు. ఎంతగాఅంటే – ఆ పాత్రప్రభావం అతగాడ్ని చాలాకాలం వెన్నంటి ఉండేటంతగా.. అది హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా మంచి నటుడన్నవాడికి ఈ లక్షణం కామన్. ఇదంతా ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నదంటే, ప్రధాని మోదీ కాలిఫోర్నియాలో ఒక కార్యక్రమంలో (టౌన్ హాల్ తరహా ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో) పాల్గొంటూ తన తల్లిచేసిన సేవల గురించి గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. తెల్లటిగడ్డం, అంతకంటే తెల్లటి జుట్టు ఆపై తేనెరంగులోని పల్చటి కళ్లజోడుతో మహామేథావిగా అప్పటివరకు కనిపించిన మోదీ అంతలో భావోద్వేగంతో మాట్లాడుతూ చంటిపిల్లవాడిలా అగుపించారు. దీంతో చాలా మందికి మోదీపట్ల విపరీతమైన సానుభూతి కలిగింది. యావత్ ప్రపంచం తన ప్రసంగాన్ని వీక్షిస్తుందన్న సంగతి మోదీకి తెలుసు. తన ప్రసంగం ఏ రీతిలో ఉంటే సభికుల మనస్సు దోచుకోవచ్చో ఈ మహానేతకు తెలుసు. చిటికెలు వేస్తారు, చేతులు గాలిలో ఊపుతారు. జోకులు పేలుస్తారు. చురకలు అంటిస్తారు. ఏ విషయాన్నీ అశ్రద్ధ చేయరు. విశ్వనాయకునిగా ఎదగడంకోసం ఏ చిన్న విషయాన్నైనా పక్కనపెట్టేయడం మోదీకి మనస్కరించదు. చివరకు భావోద్వేగ విషయంలో కూడా.

కొత్తేమీకాదు

చిన్ననాటి సంగతులు ప్రస్తావించడం నాయకుల ప్రసంగాల్లో కొత్తేమీకాదు. ఆమాట కొస్తే మోదీ కూడా ఇలా తన తల్లిగారిని తలుచుకోవడం ఇదే మొదటిసారి అంతకన్నాకాదు. టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటైన ఓ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కూడా మోదీ తన చిన్ననాటి సంగతులు బోలెడు చెప్పారు. కాలిఫోర్నియా సమావేశంలో మోదీ తన తల్లిని గుర్తుచేసుకుంటూ, ఆమె పేదకుటుంబాన్ని నెట్టుకురావడంకోసం అంట్లు తోమేవారనీ, నీళ్లు తోడేవారని చెబ్తూ బాధపడ్డారు. అంతలో తేరుకుని తన డిజిటల్ ఇండియాను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పెట్టుబడులు రాబట్టే ప్రయత్నంచేశారు.

ప్రధానమంత్రిగా పదవీస్వీకారం చేసినప్పటి నుంచీ ఈ 16నెలల్లో మోదీ తనలోని నాయకత్వ లక్షణాలతోపాటు నటుడ్ని కూడా పెంచి పోషిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల విమర్శలను ఆయన ఇప్పటికే పలుసందర్భాల్లో నిజం చేశారు. ఇకపై కూడా చేసేటట్లే ఉన్నారు. మోదీ గొప్ప నాయకుడన్న సంగతి జగమెరిగిన సత్యం. ఇందులో ఎలాంటి దాపరికంలేదు. కాకపోతే ఇప్పుడు ఆయనలోని నటనాశక్తిని సైతం యావత్ ప్రవంచం గుర్తించింది. లీడర్ కమ్ యాక్టర్ అనే క్యాటగిరీ ఉండి ఉంటే మోదీ పేరును ఆస్కార్ అవార్డుకు ఖచ్చితంగా నామినేట్ చేయవచ్చు.

ఇదో ఆర్ట్

భావోద్వేగ ప్రకటనలు చేయడం, అలాంటి అంశాలకు నాటకీయత జోడించడం ఓ పెద్ద ఆర్ట్. మోదీకి తల్లి సెంటిమెంట్ కాస్తంత ఎక్కువగానే ఉన్నట్టుంది. ఈ సెంటిమెంట్ ఎంతదాకా వెళ్ళిందంటే, అద్వానీతో తేడాలొచ్చినప్పుడు ఇంతే భావోద్వేగంతో మాట్లాడుతూ, పార్టీ తనకు తల్లిలాంటిదని ఎలుగెత్తి చాటారు. అలాగే 2007లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరులో నెగ్గిన తర్వాత ఊపిరిపీల్చుకుని బహిరంగసభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 2003లో కూడా మోదీ తనపై వచ్చిన గోధ్రా అల్లర్ల ఆరోపణలపై వివరణ ఇస్తూ కంటతడి పెట్టుకున్నారు.

ఇలా చీటికీ మాటికీ భావోద్వేగాలకు గురవడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? గుజరాత్ ముఖ్యమంత్రి హోదా నుంచి ప్రధానమంత్రి హోదాకు ఎదిగినప్పటికీ, ఆయన ఇప్పటికీ తనలోని భావోద్వేగాలను ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? పైగా ఒకే అంశాన్ని (తల్లిగారి గురించి) పలుసందర్భాల్లో ప్రస్తావించడం, ఎమోషనల్ గా మారడం చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఈ భావోద్వేగ ప్రసంగాల వల్ల వ్యక్తిగతంగా మేలు జరుగుతుందని మోదీ పూర్తిగా విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన ఏమాత్రం వీలుచిక్కినా ఈ లక్షణాన్ని వెలికితీస్తున్నారు.

ఏం కావాలో తెలుసు

మోదీ సాధారణ నాయకుడుకాదు. ఆయనకు ఏం కావాలో , ఎంతవరకు కావాలో బాగా తెలుసు. ఒకరకంగా చెప్పాలంటే ఒక మంచి దర్శకుని దగ్గర తర్ఫీదు పొందిన నటుడిలా ఎదిగారు. మనం పాతసినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ భావోద్వేగ సీన్లను ఎలా పండించారో చూశాం. అది వారి నటనకు గీటురాయి. హీరోపై సానుభూతి ఒకసారి కలిగితే చాలు, ప్రేక్షకుల్లో అది పొమ్మన్నా పోదు. దీన్నే అభిమానం అని కూడా పిలుచుకోవచ్చు. రాజకీయనాయకులకు కూడా ఇదే కీలకం. చాలాకాలం నుంచే మోదీ ఈ ఫార్ములాను అందిపుచ్చుకున్నారు. నాయకుడి స్థానం నుంచి మహానాయకునిగా ఎదిగే క్రమంలో ఆయన తనలోని నటుడ్ని కూడా అంతే స్థాయిలో పెంచుకున్నారు. అయితే, మహానాయకుడు, మహా నటుడు ఒకరిలోనే ఉంటే దేశానికి మేలుచేస్తుందా, లేక కీడుచేస్తుందా అన్నది మేథావులు ఆలోచించాల్సిన ప్రశ్న.

సరే, మోదీ ఇలా చిటికీమాటికీ భావోద్వేగ పూరిత ప్రసంగాలు చేయడంవల్ల, కంటనీరు పెట్టుకోవడంవల్ల ఆయనకు ఒరిగే మేలేమిటన్నది ఆలోచించాలి. రాష్ట్రాన్ని తనవైపుకు తిప్పుకున్న మోదీ క్రమంగా దేశాన్ని తన వైపు తిప్పుకోగలిగారు. ఇప్పుడు ప్రపంచం వైపు చూపుపడింది. అగ్రదేశాలతో చెలిమి, బడా వ్యాపారసంస్థలతో స్నేహం ఉంటే తన కలలు నిజమవుతాయన్నది మోదీ ప్రగాఢ విశ్వాసం. ఇందులో తప్పేమీలేదు. కాకపోతే భావోద్వేగ మోతాదును తగ్గించుకోకపోతే ప్రపంచ మేథో దేశాల్లో నగుబాటు తప్పదు. చురుకైన మేథావులు చిటికలో అవతలి వ్యక్తిని స్కాన్ చేస్తారు. ఇది మోదీ ఆలోచనలను ఇబ్బంది పెట్టవచ్చు. పైకి తప్పట్లుకొట్టినంత మాత్రాన అడిగిందల్లా ఇస్తామన్న గ్యారంటీలేదు. ఇక్కడ మన రాష్ట్ర నాయకుడు (జగన్) గురించి కూడా ఒక్క మాట చెప్పుకోవాలి. ఆయన కూడా తనలోని నాయకుడ్నీ, నటుడ్ని తట్టిలేపి ముందుకు సాగుతుంటారు. భావోద్వేగంతో సాగించే ఓదార్పు యాత్రలవల్ల ఎన్నికల్లో ఎంతో కొంత లాభం గడించినప్పటికీ, సేమ్ ట్రెండ్ ఎల్లకాలం వర్క్ అవుట్ కాదని గ్రహించలేకపోతున్నారు.

రాముడే గురువు

బీజేపీ వాళ్లందరికీ రామాయణం ఒక గైడ్ బుక్. ఇక్కడ మనం అయోధ్య రామాలయ నిర్మాణం, అద్వానీ రథయాత్రల గురించి చెప్పుకోబోవడంలేదు. అంత కంటే ముఖ్యమైనది – రామాయణ మహాకావ్యంలోని రాముని నాయకత్వ లక్షణాల గురించి. రాముడికి పిన్నవయసులోనే పట్టాభిషేకం చేయాలని తండ్రి దశరథ మహారాజు అనుకోగానే కైక అడ్డుపడింది. దీంతో రాముడు తన పత్ని సీతాదేవి, తమ్ముడు లక్షణుడితోసహా వనవాసం చేయాల్సివచ్చింది. ఆ సమయంలో ఉత్తరాదిన ఉన్న అయోధ్య నుంచి దక్షిణ కొసగా ఉన్న రామేశ్వరం దాకా పాదయాత్ర చేశాడు. ఈ మధ్యలో సీతాపహరణ ఘట్టం చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనను రాముడు పదేపదే తలుచుకుని కుమిలిపోయాడు. అతని భావోద్వేగ పరిస్థితిని చక్కదిద్దడానికి వానరసేన అతనితోపాటు కదిలింది. రాముడు నాయకుని నుంచి మహానాయకునిగా ఎదగడానికి ఈ భావోద్వేగ లక్షణం బాగా సహకరించింది. సామదానభేద దండోపాయాలతో పరిస్థితి చక్కదిద్దుకోవాలన్నది ఆర్యోక్తి. ఈనాలుగిటితో పాటు భావోద్వేగంతో చక్కదిద్దుకునే ధోరణి ఉండనే ఉంది. అచ్చతెలుగులో చెప్పాలంటే ఏడ్చి సాధించడం లాంటిదన్నమాట. తెలివైన నాయకులమని చెప్పుకుంటున్న కొందరు ఈ పద్ధతిని విడిచిపెట్టడానికి సుముఖంగాలేరు. ఘనమైన మోదీ కూడా అంతే. నాటి రాముడు తన భార్యను తలుచుకుంటే, నేటి మోదీ తన తల్లిని తలచుకుంటూ భావోద్వేగాలకు గురవుతుంటారు. ఇంతకంటే మరేవిషయం (గోధ్రా సంఘటనసహా) ఈయన్ని కదిలించలేకపోయాయి. భావోద్వేగంవల్ల సత్వరం కలిగే ప్రయోజనం ఏమంటే ఏకతాటిన అందర్నీ తమవైపునకు తిప్పుకోవడం. తన ఎదుట ఉన్న ప్రేక్షకులు (సభికులు) మహామేథావులైనప్పటికీ ఒక ఇంద్రజాల ప్రదర్శనలా సభను నడిపించడంలో మోదీ నెంబర్ వన్ గా అయ్యాడని విమర్శకులే ఒప్పుకుంటున్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి కూడా మోదీ కొన్ని విద్యలు నేర్చుకున్నట్లు కనబడుతోంది.

మొత్తానికి మోదీ గ్లోబల్ నాయకుడేకాదు, ఆయన గ్లోబల్ నటుడుకూడా అయ్యారు. నేషనల్ స్టార్ నుంచి ఇంటర్నెషనల్ స్టార్ గా ఎదిగారు. చివరకు ఈ ధోరణి ఎటు దారితీస్తుందన్నది మాత్రం శేషప్రశ్నే.

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close