గీతంకు భూకేటాయింపులు ఉచితంగా ఇస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఆ భూమి నాలుగు దశాబ్దాలుగా కాలేజీ అధీనంలోనే ఉంది. జగన్ రెడ్డి కుట్రలకు పాల్పడి.. అది ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టించాడు. ఇదేదో భూదోపిడీ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అసలు దోపిడీ భారతి సిమెంట్స్ ది. అధికారం చేతుల్లో ఉందని అడ్డగోలుగా లీజులు రాసుకున్నారు. ఇందు కోసం మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరును కూడా వాడుకున్నారు. ఇలాంటి ఘోరమైన దోపిడీ చేసేది.. చేసి.. దశాబ్దాలుగా విద్యారంగానికి, పేద రోగులకు సేవలు చేస్తున్న సంస్థపై నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారు.
గీతం ..విశాఖకు సేవ చేస్తున్న విద్యా సంస్థ
విశాఖ నడిబొడ్డున నాలుగు దశాబ్దాలుగా విద్యా సేవలు అందిస్తున్న గీతం యూనివర్సిటీపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. 40 ఏళ్లుగా ఆ విద్యాసంస్థ అధీనంలోనే ఉన్న భూములను, రాజకీయ కక్షతో ఆక్రమణలు గా చిత్రీకరించి అర్థరాత్రి గోడలు కూల్చివేసి.. ప్రభుత్వ భూములనే బోర్డులు పెట్టారు. కేవలం సాంకేతిక కారణాలను సాకుగా చూపి, విద్యాసంస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి సర్కార్ అక్కడ ప్రభుత్వ బోర్డులు పాతించింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ భూములను ఉచితంగా ఏమీ ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి, ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరను వసూలు చేస్తూ క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది విద్యాసంస్థకు ఇచ్చే వెసులుబాటు మాత్రమే.
అసలు దోపిడీ భారతి’ సిమెంట్స్‌ది!
గీతంను వేలెత్తి చూపే వైసీపీ నేతలు, తమ అధినేత సొంత సంస్థ భారతి సిమెంట్స్ కోసం చేసిన అడ్డగోలు లీజుల గురించి ఎందుకు మాట్లాడటం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. 2024 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు, నియమ నిబంధనలను తుంగలో తొక్కి వేలం లేకుండానే కడప జిల్లాలో సుమారు 744 ఎకరాల సున్నపురాయి గనులను భారతి సిమెంట్స్‌కు కట్టబెట్టారు. కేంద్ర మైనింగ్ చట్టాలు , సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించి, కేవలం న్యాయ సలహా పేరుతో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పేర్లను కూడా ప్రస్తావిస్తూ ఈ ప్రీ-పోల్ డీల్ పూర్తి చేశారు. వేల కోట్ల విలువైన ప్రకృతి సంపదను సొంత కంపెనీకి ధారాదత్తం చేయడం అసలైన దోపిడీ .
విద్యా సేవ వర్సెస్ వ్యాపార లబ్ధి
గీతం సంస్థ వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను, ఎంతో మంది రోగులకు ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఒక విద్యాసంస్థ చుట్టూ ఉన్న చిన్నపాటి భూ వివాదాలను పరిష్కరించడం వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. కానీ భారతి సిమెంట్స్ లీజుల వ్యవహారంలో కేవలం వ్యక్తిగత ఆర్థిక లాభమే తప్ప ప్రజా ప్రయోజనం శూన్యం. 2015 కేంద్ర మైనింగ్ సవరణ చట్టం ప్రకారం వేలం ద్వారానే గనులు కేటాయించాల్సి ఉండగా, భారతి సిమెంట్స్ కోసం పాత దరఖాస్తులను తెరపైకి తెచ్చి 50 ఏళ్ల పాటు లీజులు రాసుకోవడం అత్యంత ఘోరమైన అక్రమం. ఈ అక్రమ లీజులపై ఇప్పటికే కేంద్ర గనుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం గనుల లీజుల్నిరద్దు చేయబోతోంది.
దొంగే దొంగ అని అరిచినట్లుగా.. వేల ఎకరాల గనులను అడ్డగోలుగా లీజులు రాసుకున్న వారే, ఇప్పుడు చట్టబద్ధంగా నిధులు చెల్లించి క్రమబద్ధీకరించుకుంటున్న గీతం సంస్థపై బురద చల్లడం విడ్డూరంగా ఉంది. అధికారం చేతుల్లో ఉందని చట్టాలకు వక్రభాష్యం చెప్పి దోచుకున్నది ఎవరో, దశాబ్దాలుగా సేవా రంగంలో ఉండి వ్యవస్థల వేధింపులకు గురైంది ఎవరో ప్రజలకు తెలియదని అనుకుంటారా?
