అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన జిల్లాల విభజనతో ప్రభుత్వానికి చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. అప్పట్లో నోరు మెదపని వారు ఇప్పుడు తమ డిమాండ్లు బలంగా వినిపిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేయడంతో కొత్త కొత్త సమీకరణాలు చేస్తున్నారు. దీంతో పాత సమస్యలు పరిష్కారం అయినా కొత్త సమస్యలు వస్తున్నాయి.
అన్నమయ్య జిల్లాను తీసేయాలని అధికారుల సూచనలు
మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేస్తే అన్నమయ్య జిల్లాచిన్నది అయిపోతుంది. రెండు, మూడు నియోజకవర్గాలతో ఓ జిల్లా అవుతుంది.అందుకే ఆ జిల్లాను తీసేయాలని రాజంపేటను కడపలో చేర్చాలన్న ప్రతిపాదనలు అధికారులు చేశారు. దీనిపై నిర్ణయం తీసుకోలేదు. కానీ అసలు మొదట జిల్లాను ఏర్పాటు చేయకపోతే సమస్య వచ్చేది కాదు..కానీ ఏర్పాటు చేసిన జిల్లాలను తొలగించడం అనేది ప్రజల సెంటిమెంట్ ను దెబ్బతీస్తుంది.
గూడూరు నెల్లూరులోనే!
గతంలో జరిగిన జిల్లాల విభజన వల్ల కొన్ని ప్రాంతాల ప్రజలకు జిల్లా కేంద్రాలు సుదూర ప్రాంతాలకు వెళ్లడం, భౌగోళికంగా ఇబ్బందులు కలగడంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. నవంబర్ 27న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల సమయం ఇచ్చింది. గడువు ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 927 అభ్యంతరాలు, వినతులు వచ్చాయి. వీటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు, పరిపాలన కేవలం కాగితాలకే పరిమితం కాకుండా సామాన్యుడికి చేరువగా ఉండాలని అధికారులను ఆదేశించారు. గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం గతంలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదం. ఇప్పుడు దాన్ని సరిదిద్దుతున్నారు.
పది కొత్త రెవిన్యూ డివిజన్లు
పరిపాలనను మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా దాదాపు 10 కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో నక్కపల్లి , అద్దంకి , పీలేరు ( , బనగానపల్లె , మడకశిర వంటివి ప్రముఖంగా ఉన్నాయి. అలాగే, కర్నూలు జిల్లాలోని ఆదోనిని విభజించి పెద్ద హరివనం ‘ అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ వెలువడిన అనంతరం జనవరి 1, 2026 నుండి ఈ కొత్త జిల్లాలు, డివిజన్లు పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ తర్వాత వెలువడే ఈ నిర్ణయం ఏపీ పరిపాలనలో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. వందశాతం ప్రజల్ని సంతృప్తి పరచలేకపోవచ్చు కానీ.. వీలైనంత వరకూ ప్రజల్ని సంతృప్తి పరిచేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.