దసరా పండుగకు ఎక్కడా కనిపించని వైసీపీ అధినేత జగన్ రెడ్డి.. దీపావళి పండుగకు రెండు చిచ్చుబుడ్లు కాల్చి ఫోటోలు విడుదల చేశారు. అది కూడా జీసస్ అని పేరు పెట్టుకున్న ఇంట్లో నిర్వహించారు. అంతే.. వైసీపీ సోషల్ మీడియా మూక.. మా అన్న హిందూ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇలాంటి ప్రయత్నాలన్నీ జగన్ రెడ్డి మతాన్ని ఎప్పటికపుడు తెరపైకి తెస్తూంటాయి. ఆయన క్రైస్తవుడు అని గుర్తు చేస్తూంటాయి. కానీ హిందువును అని చెప్పుకోవడానికి నాటకాలు ఆడుతున్నారన్న విమర్శలకూ కారణం అవుతాయి. అందుకే జగన్ రెడ్డి తాను రాజకీయాల్లో కాస్త నిజాయితీని అలవర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
జగన్ హిందువు కాదు.. ఆ విషయం అందరికీ తెలుసు !
జగన్ రెడ్డి ఎవరు అంటే.. ఆయన క్రైస్తవుడు అని అందరికీ తెలుసు. ఆయన ఇళ్లు, కార్యాలయాలు.. ఎక్కడ చూసినా క్రైస్తవత్వం ఉట్టిపడుతుంది. అది తప్పు కాదు. జగన్ రెడ్డి తాత ముత్తాతల కాలంలోనే మతం మారారు. హిందూత్వం నుంచి క్రైస్తవంలోకి మారారు. అప్పటి నుంచి అదే పాటిస్తున్నారు. జగన్ కూ క్రైస్తవంపై అపార నమ్మకం ఉంది. ఆయన పాటిస్తారు. ఇది బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం . కానీ జగన్ రెడ్డి మాత్రం తనను తాను క్రైస్తవుడిగా బహిరంగంగా చెప్పుకునేందుకు సిద్ధపడటం లేదు. పైగా.. హిందూ వేషాలు వేస్తూ.. నలుగుర్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
నేను క్రైస్తవుడ్ని.. అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పుకోవడం రాజకీయం!
మన దేశానికి ఉన్న పరిష్కరించలేని సమస్యల్లో కుల, మతాలు కీలకం. పుట్టిన ప్రతి ఒక్కరికి కులం, మతం ఆటోమేటిక్ గా అంటుకుంటుంది. జగన్ రెడ్డికి క్రైస్తవం అలా వచ్చింది. ప్రతి ఒక్కరికీ వస్తుంది. వీటిని వ్యతిరేకించేవారు తమకు కులం, మతం లేదని చెప్పుకుంటారు. కానీ జగన్ మోహన్ రెడ్డి అలా తనకు కులం , మతం లేదని చెప్పుకోవడం లేదు. తాను క్రైస్తవుడ్ననీ అంగీకరించడంలేదు. కానీ హిందువునని నమ్మించేందుకు స్కిట్స్ వేయడం వల్లనే సమస్య వస్తోంది. తాను క్రైస్తవుడ్నని అన్ని మతాలను గౌరవిస్తానని.. దేవుడు ఏ రూపంలో ఉన్న ఇక్కడేనని చెప్పుకుని ఆయన రాజకీయం చేస్తే కాస్త నిజాయితీ ఉంటుంది. హిందూ నేతలు అంతా క్రిస్మస్ పార్టీలకు, ఇఫ్తార్ విందులకు వెళ్లడం లేదా ?. వారు తాము క్రైస్తవులం అని.. ముస్లింలం అని నమ్మించేందుకు ప్రయత్నించడం లేదు. అందరి మతాలను గౌరవిస్తామని సంకేతాలిస్తున్నారు. జగన్ అలా ఎందుకు చేయలేరు ?
నటించడం వల్ల ఓటు బ్యాంకుకు గండి
జగన్ రెడ్డి తాను హిందువును కాదని క్రైస్తవుడ్నని అనుకుంటే ప్రజలు ఓట్లేయరని అనుకుంటున్నారు. గతంలో ఆయన స్వరూపానందతో కలిసి చేసిన ప్రయత్నాల వల్ల ఆయన హిందువు అని ఎవరూ నమ్మలేదు. ఆ కారణంగా ఓట్లు వేయలేదు. జగన్ కు ఆ సమయంలో ఓట్లు వేసిన దానికి కారణాలు వేరు. కానీ ఆయన క్రైస్తవుడు అన్న కారణంగా ఓట్లేసిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తాను క్రైస్తవుడ్నని బహిరంగాలు చెప్పుకోకపోవడం వల్ల వారు కూడా జగన్ పై అభిమానం కోల్పోయే అవకాశం ఉంది. అంటే.. హిందువుల ఓట్లు రావన్న భయంతో చేసే రాజకీయ నాటకాల వల్ల మొదటికే మోసం వస్తోంది. జగన్ రెడ్డి ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా..తన క్రైస్తవత్వాన్ని అంగీకరించి నిజాయితీ రాజకీయాలు చేస్తే.. రాజకీయంగా ప్రజలు నమ్ముతారు. లేదంటే.. ఆయన డ్రామాల ఫోటోలతో వైసీపీ సోషల్ మీడియా ఎలివేషన్లు వేసి.. కామెడీలు చేసి పరువు తీస్తుంది. అంతకు మించి ఒక్క ఓటు ఉపయోగం ఉండదు.