వైఎస్ వివేకానందరెడ్డికి న్యాయం జరిగే వరకూ పోరాడాలని వైఎస్ సునీత నిర్ణయించుకున్నారు. మరోసారి ఆమె సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసు విచారణను కొనసాగించాలని .. సూత్రధారుల గురించి ఇంకా బయటకు రావాల్సి ఉందని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె పిటిషన్ ను సీబీఐ కోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. నిందితులకు పిటిషన్ కాపీలు అందేలా చూడాలని సూచించారు.
గతంలో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సీబీఐ దర్యాప్తునకు గత ప్రభుత్వంలో ఆటంకాలు కలిగించారని, అధికార దుర్వినియోగం జరిగిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దర్యాప్తును కొనసాగించాలని కోర్టు ఆదేశాసిస్తే కొనసాగిస్తామని సీబీఐ తెలిపింది. అయితే సుప్రీంకోర్టు.. నిర్ణయం తీసుకోలేదు. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని.. ఆదేశించింది. ఎనిమిది వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
సుప్రీంకోర్టు సూచనలతో వైఎస్ సునీత హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోసారి విచారణ చేయించాలని సునీత కోరుతున్నారు. అత్యంత దారుణంగా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినప్పటికీ ఇప్పటి వరకూ కోర్టులో ట్రయల్ కు రాలేదు. సూత్రాధారులెవరో బయటకు తెలియలేదు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక కేసు తేలుతుందని అనుకుంటే ఆయన కూడా మోసం చేశారు. దాంతో పోరాడి ఆ కేసును సీబీఐకి వెళ్లేలా చేసుకున్నారు. కానీ .. ఇప్పటికీ ఆ కేసు తేలలేదు.