తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడే విషయంలో టీటీడీ ప్రస్తుత బోర్డు అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుంటే, విపక్ష వైసీపీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం అబద్ధపు ప్రచారాలకు తెగబడుతోంది. నెయ్యి టెండర్ల విషయంలో బొత్స సత్యనారాయణ వంటి నేతలు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా కావాలని నెయ్యి టెండర్ల విషయాలను తప్పుగా చెబుతూ.. రాజకీయం చేస్తున్నారు.
హెరిటేజ్‌తో సంబంధం లేని ఇందాపూర్
వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ.. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందనేది. టీటీడీ చైర్మన్ ఈ విషయాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టారు. ఇందాపూర్ డెయిరీ అనేది ఒక స్వతంత్ర సంస్థ. హెరిటేజ్ సంస్థ కేవలం చీజ్ తయారీ కోసం మాత్రమే అక్కడి నుంచి ముడి పదార్థాలను సేకరిస్తుంది. ఇలా కొనుగోలు చేయడం వ్యాపార లావాదేవీ తప్ప, యాజమాన్య సంబంధం కాదు. నిజానికి, గతంలో వైసీపీ ప్రభుత్వం టెండర్లు కట్టబెట్టిన అమూల్ డెయిరీ కూడా ఇదే ఇందాపూర్ నుంచి పాలు, నెయ్యి సేకరించింది. తమకు నచ్చినప్పుడు నాణ్యమైనదిగా కనిపించే ఇందాపూర్, ఇప్పుడు రాజకీయ విమర్శలకు వాడుకోవడం వైసీపీ అనుసరిస్తున్న దారుణమైన రాజకీయానికి సాక్ష్యం.
నందిని నెయ్యి విషయంలో తప్పుడు ప్రచారం
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టెండర్ నిబంధనలు మార్చి కర్ణాటకకు చెందిన నందిని సంస్థకు అసలు నెయ్యి కాంట్రాక్టు దక్కకుండా చేశారు.కానీ ఇప్పుడు భారీగా ఆ సంస్థకు కాంట్రాక్ట్ దక్కినప్పటికీ… తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నందిని డెయిరీని కావాలనే పక్కన పెట్టారని వైసీపీ చేస్తున్న ప్రచారం కూడా పచ్చి అబద్ధం. టీటీడీకి అవసరమైన భారీ పరిమాణంలో నెయ్యిని సరఫరా చేయలేమని నందిని సంస్థే స్వయంగా స్పష్టం చేసింది. అయినా అత్యధికంగా నెయ్యిని సరఫరా చేయడానికి కాంట్రాక్ట్ పొందింది. అవసరమైన ఇతర నెయ్యిని ఇందాపూర్ , సంగం డెయిరీ , మదర్ డెయిరీ వంటి సంస్థలు సరఫరా చేసేందుకు కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. అత్యంత పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా పనులు కేటాయించారు. ఇక్కడ ఎవరికీ అయాచిత లబ్ధి చేకూర్చలేదని, కేవలం శ్రీవారి సేవలో నాణ్యతకే ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమవుతోంది.
క్వాలిటీ కోసం సరికొత్త MRL స్కోర్ బోర్డు
గతంలో నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ప్రస్తుత బోర్డు భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా MRL అంటే Minimum Residue Level స్కోర్ బోర్డు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు అత్యాధునిక ప్రమాణాలను పాటించడమే కాకుండా, రవాణాలో నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు సేకరణ పరిధిని 1500 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్లకు తగ్గించారు. దూరం తగ్గడం వల్ల నెయ్యి తాజాగా ఉండటమే కాకుండా, కల్తీకి అవకాశం లేకుండా పకడ్బందీ నిఘా ఏర్పాటు చేశారు.
పారదర్శకతపై టీటీడీ చైర్మన్ క్లారిటీ
టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు గారు టెండర్ల ప్రక్రియపై వివరణాత్మక ప్రకటన విడుదల చేస్తూ, ప్రతి పైసా , ప్రతి కిలో నెయ్యి సేకరణలోనూ జవాబుదారీతనం ఉంటుందని స్పష్టం చేశారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు కేవలం ప్రజలను అయోమయానికి గురిచేయడానికే తప్ప, వాటిలో ఎటువంటి సాంకేతిక లేదా నైతిక ఆధారం లేదు. టెండర్లు దక్కించుకున్న సంస్థలన్నీ పాడి పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్నవే తప్ప, రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినవి కావు. భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న తిరుమల లడ్డూ విషయంలో రాజకీయాలు చేయడానికి, తప్పుడు ఆరోపణలు చేయడానికి వైసీపీ ఏ మాత్రం వెనుకాడటం లేదు. ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ, భక్తులకు స్వచ్ఛమైన గోఘృతంతో చేసిన ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ కృషి చేయడాన్ని తప్పు పడుతోంది.
