ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే ఎన్నికల సమీకరణాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. అధికార కూటమిని ఢీకొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త మహా కూటమి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో జడ శ్రవణ్ నేతృత్వంలోని జై భీమ్ భారత్ పార్టీ, రామచంద్ర యాదవ్ స్థాపించిన బీసీవై పార్టీలతో జగన్ మోహన్ రెడ్డి జట్టు కట్టబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ పొత్తుల వ్యూహం వెనుక బలమైన సామాజిక సమీకరణాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
వారిద్దరితో కుల రాజకీయాలు అందుకే!
వైసీపీ నాయకత్వం ప్రధానంగా దళిత, వెనుకబడిన తరగతుల ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో చీలిపోయిన ఓట్లను దగ్గరకు చేర్చడం ద్వారా విపక్ష కూటమి ఓటు షేర్‌ను దెబ్బతీయాలని జగన్ భావిస్తున్నారు. ఈ మహా కూటమిలో మజ్లిస్ వంటి పార్టీలను కూడా భాగస్వాములను చేసే దిశగా మంతనాలు సాగుతున్నాయి. మైనారిటీ ఓట్లు గంపగుత్తగా ఈ కూటమికి పడితే, రాయలసీమ , కోస్తా ప్రాంతాల్లోని కీలక నియోజకవర్గాల్లో విజయ అవకాశాలు మెరుగుపడతాయని వైసీపీ అంచనా వేస్తోంది.
జగన్‌ను నమ్మలేకపోతున్న కమ్యూనిస్టులు
మరోవైపు కమ్యూనిస్టు పార్టీల తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంప్రదాయబద్ధంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడే వామపక్షాలు, వైసీపీ సామాజిక అజెండాకు మద్దతు ఇస్తాయా లేదా అనేది సందిగ్ధంగా ఉంది. వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలు, జగన్ రాజకీయ చాణక్యాన్ని తట్టుకోలేక కమ్యూనిస్టులు దూరంగా ఉండే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే, జడ శ్రవణ్ , రామచంద్ర యాదవ్ వంటి వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో దూకుడు పెంచడం వల్ల, వైసీపీకి వారితో జతకట్టడం రాజకీయంగా కలిసి వచ్చే అంశమే.
కూటమికి కూటమితోనే చెక్
రాష్ట్రంలో బలమైన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఎదుర్కోవాలంటే కేవలం ఒంటరి పోరాటం సరిపోదని జగన్ గ్రహించినట్లు చెబుతున్నారు. చిన్న పార్టీలను కలుపుకోవడం వల్ల ఆయా సామాజిక వర్గాల్లో వచ్చే చిన్నపాటి మార్పు కూడా భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రత్యేకించి జడ శ్రవణ్ కు ఉన్న దళిత మేధావి ఇమేజ్, రామచంద్ర యాదవ్ కు ఉన్న యువత మద్దతు వైసీపీకి కొత్త ఊపిరి పోస్తాయని కేడర్ భావిస్తోంది. ఈ మహా కూటమి గనుక పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటే, వచ్చే ఎన్నికలు రెండు ప్రధాన పక్షాల మధ్య హోరాహోరీ పోరుగా మారడం ఖాయం.


