డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ మార్పు రాజోలు రాజకీయాల్లో సంచలనంగా మారింది.
గతంలో పి.గన్నవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న రాజేశ్వరి దేవి, ఆ తర్వాత జనసేనలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా ఆమెను రాజోలు ఇన్చార్జిగా నియమించడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం రాజోలు వైసీపీ ఇన్చార్జిగా ఉన్న సీనియర్ నేత గొల్లపల్లి సూర్యరావును ఆ పదవి నుంచి తప్పించి, పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించినట్లుగా ప్రకటించారు. ఆ పీఏసీ పేరుకే ఉంటుంది. పక్కన పెట్టాలనుకున్న వాళ్లందర్నీ అందులో చేర్చి పక్కన పెట్టేస్తూంటారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆయనకు జగన్ ఇప్పుడు రాజకీయ భవిష్యత్ ను ముగించేశారు.
మాజీ మంత్రిగా, సీనియర్ నాయకుడిగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసిన గొల్లపల్లిని ఇంచార్జ్‌గా తప్పించండ ఆయన అనుచరులను విస్మయానికి గురిచేస్తోంది. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకుడిని కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బాధ్యతలు ఇవ్వడం గొల్లపల్లికి చేసిన అన్యాయమేనని వారంటున్నారు. పాముల రాజేశ్వరి నియామకంపై పార్టీలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఒకవైపు మహిళా నాయకురాలికి అవకాశం ఇచ్చామని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, గొల్లపల్లి వంటి విధేయుడిని పక్కన పెట్టడం పార్టీ క్యాడర్లో అసంతృప్తికి దారితీస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ రాజోలు ఇంచార్జ్ గా గొల్లపల్లి కుమార్తెనే నియమించినందున జగన్ ఆయనపై నమ్మకం కోల్పోయారని వైసీపీలో చెప్పుకుంటున్నారు.


