ఏపీ నుంచి పెట్టుబడులు పోతున్నాయని వైసీపీ, సాక్షి మీడియా చెబుతోంది. ఊరూ పేరూ లేనికంపెనీలకు జగన్ హయాంలో పెద్ద ఎత్తున భూములు కేటాయించారు. ఆ భూముల్లో ఇప్పటి వరకూ రూపాయి పెట్టుబడి పెట్టలేదు. .కనీసం చదును చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం పెట్టుబడులు పెడతారా.. భూములు ఇచ్చేస్తారా అంటే తమ బాగోతం అంతా ఎక్కడ బయటకు వచ్చేస్తుందోనని భూములు ఇచ్చేసిపోతున్నారు. తమ లంచం వాటాలు పోతున్నాయని బాధతో వైసీపీ పెద్దలు, సాక్షి పెట్టుబడులు పోతున్నాయని విచిత్రమైన ప్రచారం చేస్తున్నారు.
అవన్నీ జగన్ తెచ్చిన ఉత్తుత్తి కంపెనీలే !
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి పారిశ్రామిక విప్లవం వచ్చేసిందని, లక్షల కోట్ల పెట్టుబడులు కురిశాయని సాక్షి మీడియా ఊదరగొట్టిన మాటల వెనుక ఉన్న అసలు రంగు ఇప్పుడు బయటపడుతోంది. ఊరూ పేరూ లేని, కనీసం వెబ్సైట్ కూడా సరిగ్గా లేని డొల్ల కంపెనీలకు వేల ఎకరాల ప్రభుత్వ భూములను జగన్ సర్కార్ కట్టబెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కంపెనీల పనితీరుపై, కేటాయించిన భూములపై ఆరా తీస్తుంటే.. ఎక్కడ తమ అసలు స్వరూపం బయటపడుతుందోనన్న భయంతో ఆ సంస్థలు తోక ముడిచి పారిపోతున్నాయి. ఈ ఫేక్ నిష్క్రమణలను చూసి రాష్ట్రం నుంచి పెట్టుబడులు పోతున్నాయని వైసీపీ ప్రచారంచేస్తోంది.
భూదోపిడీ కోసమే ఆ కంపెనీలు
జగన్ హయాంలో భూములు పొందిన సదరు కంపెనీలు ఇప్పటివరకు ఆ భూముల్లో కనీసం చదును చేసిన పాపాన పోలేదు. రూపాయి పెట్టుబడి పెట్టలేదు, ఒక్క ఉద్యోగం కల్పించలేదు. కేవలం భూములను హోల్డ్ చేసి, భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికో లేదా ఇతర అవినీతి లావాదేవీలకో వీటిని వాడుకున్నారనేది బహిరంగ రహస్యం. సాక్షి మీడియా , వైసీపీ నేతల ఆవేదన అంతా రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదు.. ఆ డొల్ల కంపెనీల వెనుక ఉన్న తమ లంచాల వాటాల గురించి అని స్పష్టమవుతోంది. ఆ ఏ వ్యాపారం చేయని.. చేయలేని కంపెనీలు వెళ్ళిపోతుంటే.. రాష్ట్రం నష్టపోతోందంటూ కట్టుకథలు అల్లుతున్నారు.
నిజమైన పెట్టుబడుల కోసం ప్రక్షాళన
రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీసిన ఇటువంటి సూట్ కేస్ కంపెనీల నిష్క్రమణ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌కు శుభసూచకం. ప్రభుత్వ భూములను కబ్జా పెట్టిన దొంగ కంపెనీలను పంపించి, నిజాయితీగా పరిశ్రమలు స్థాపించే సంస్థలకు ఆ భూములను కేటాయించాల్సిన అవసరం ఉంది. వైసీపీ చేసిన తప్పులను సరిదిద్దుతుంటే, తమ అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందన్న బాధతో చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని టీడీపీ నేతలంటున్నారు.
