ఫీడ్ బ్యాక్.. అనేది అందరికీ చాలా అవసరం. స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఫీడ్ బ్యాక్ ఇవ్వండి అని ఇచ్చే దాకా వదిలి పెట్టరు. అది ఒక్కటే కాదు.. ఎవరైనా అంతే. ఎందుకంటే ఆ వచ్చే ఫీడ్ బ్యాక్ను బట్టి తాము తప్పులు ఏమైనా చేస్తే వెంటనే దిద్దుకుని బాగుపడాలని అనుకుంటారు. ఏం తప్పులు చేసినా భరించాల్సిన అవసరం కస్టమర్లకు ఉండదు. ఇది ఒక్క వ్యాపార సంస్థలకే కాదు.. ప్రజలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. రాజకీయ పార్టీలకు అయితే ఇంకా చాలా ముఖ్యం. వైసీపీ అలాంటి వ్యవస్థను పట్టించుకుంటున్నట్లుగా లేదు.
ఎన్డీఏకు సపోర్ట్ – క్యాడర్ అభిప్రాయాలేంటో తెలుసుకున్నారా ?
ఒకప్పుడు టీడీపీ, జనసేన పార్టీ కలిసి పని చేశాయి. ఆ సమయంలో బీజేపీ పొత్తులో లేదు. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి.. వైసీపీ సహకరించింది అంటే.. క్యాడర్ కొంత వరకూ సర్దుకున్నారు. కానీ టీడీపీ, జనసేనతో కలిసి వైసీపీని పాతాళంలోకి బీజేపీ తొక్కేసింది. అలాంటప్పుడు మళ్లీ ఆ కూటమికి ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం అనేది సాధారణ వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ముస్లింలు, దళితులు. వారు సోషల్ మీడియాలో జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయాలను వైసీపీ ఎందుకు పట్టించుకోదు ?
అన్నీ జగన్ కోసమే చేస్తే క్యాడర్ ఎందుకు ?
జగన్ రెడ్డి కోసమే వైసీపీ ఉందని.. ఆయన లాభం.. ప్రయోజనాల కోసం వైసీపీ పని చేస్తుందన్న విధంగా నిర్ణయాలు ఉంటున్నాయి. ఆయన వెనుక ఉన్న వారంతా ఆయన బానిసలని.. ఆయన ఏది చెబితే అది పాటిస్తారని అనుకుంటున్నారు. అందుకే పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు కూడా కొంత మందికి మోకాళ్ల దండాలు పెట్టే డ్యూటీలను వేస్తున్నారు. ఈ మైండ్ సెట్ తో.. అందర్నీ … ఎల్లకాలం తన వెనుక తిప్పుకోగలం అనేది అమాయకత్వం. రోజు రోజుకు క్యాడర్ నమ్మకం కోల్పోతోంది. క్యాడర్ అభిప్రాయాలను.. ఇంత కాలం వారికి నూరిపోసిన భావజాలాన్ని కూడా తానే నవ్వులాటగా తీసుకునే పరిస్థితి వస్తే వారు మాత్రం ఏం చేయగలరు?
ఓ సిద్ధాంతం లేకపోతే పార్టీ ఎలా ఉంటుంది ?
బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కు ఓ సిద్ధాంతం ఉంది. ఆయన బీజేపీని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే.. దళితులు, ముస్లింలు ఆయనకు మద్దతిస్తారు. బీజేపీతో వెళ్తే వారు దూరమవుతారు. అందుకే లాలూ యాదవ్ జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధపడ్డారు కానీ.. ఎప్పుడూ బీజేపీతో రాజీపడలేదు. పోరాడుతూనే ఉన్నారు. ఆ ప్రతిఫలంగానే .. పార్టీ బతికింది. కానీ జగన్ రెడ్డి ఏం చేస్తున్నారు?. తన ఓటు బ్యాంకును మోసం చేసి బీజేపీతో రాజీ పడిపోయారు. ఇప్పుడు ఆయన పార్టీని ఎలా బతికించుకోగలుగుతారు?. ఓటు బ్యాంక్ విశ్వాసం కోల్పోతే.. పార్టీల పునాదులు కదిలిపోతాయి. ఇప్పుడు వైసీపీకి అదే జరుగుతోంది.