గవర్నర్ ప్రసంగం కోసం అసెంబ్లీకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు 11 నిమిషాల్లో సభ నుంచి వెళ్లిపోయారు. ఈ లోపు చేయాల్సిన రచ్చ చేశారు. సభ ప్రారంభమయ్యే ఒక్క నిమిషం ముందు అంటే 9 గంటల 59 నిమిషాలకు సభలోకి వచ్చిన జగన్…. వైసీపీ ఎమ్మెల్యేలు .. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత గొంతు చించుకోవడం ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగలడం ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని పది నిమిషాలు పాటు నిర్వహించి ఇక గొంతు నొప్పి, చేయి నొప్పి ఎందుకని 10 గంటల పది నిమిషాలకు సభ నుంచి బయటకు వచ్చారు. అక్కడ్నుంచి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
ఇంత మాత్రం దానికే వారు సభకు రావడం ఎందుకు అన్న ప్రశ్న అందరికీ వస్తుంది. కేవలం హాజరు కోసమే వచ్చారు. డిజిటల్ అటెండెన్స్ ఉన్నందున.. వచ్చి పదినిమిషాలు కూర్చుంటే హాజరు పడుతుందని వచ్చారు. అయితే గవర్నర్ ప్రసంగం హౌస్ బిజినెస్ కిందకు వస్తుందా లేదా అన్న దానిపై సందేహాలు ఉన్నాయి. అయినా.. రేపు అనర్హతా వేటు వేస్తే..తాము సభకు హాజరయ్యామని చెప్పుకుని న్యాయపోరాటం చేయడానికైనా ఇది సరిపోతుందని వారు అసెంబ్లీకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల కోసమో.. రాష్ట్రం కోసమే అసెంబ్లీని బహిష్కరించడం లేదు. కేవలం తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయన రావడం లేదు. అధికారికంగా వచ్చేది అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన పని ఉండేది కాదు. కానీ ఆయనకు ప్రజలు ఇవ్వలేదు. అయినా సరే ప్రభుత్వం ఇవ్వాలని మొండికేసి అసెంబ్లీకి రావడం లేదు. అది ఆయన నైజం అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
