ఐదేళ్ల జనసేన సాధించింది ఏంటి, సాధించాల్సింది ఏంటి?

2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావించి, ఈ రోజుకి సరిగ్గా అయిదేళ్లు. 2019 ఎన్నికల్లో టిడిపితో కానీ వైఎస్సార్సీపీతో పొత్తు లేకుండా వామపక్షాలను కలుపుకొని పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించి ఉన్నాడు. ఈ 5 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో జనసేన పార్టీ ఏం సాధించింది? ఏం సాధించలేకపోయింది?

సాధించిన విజయాలు ఏంటి?

1. జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత సాధించిన మొదటి విజయం, తాను మద్దతు ప్రకటించిన టీడీపీ ని అధికారంలో కూర్చోబెట్టడం. చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న నాలుగు ఎన్నికలు – 1999,2004,2009,2014 లలో అన్నిటి కంటే మిన్నగా 2014లో ఫలితాలు రావడమే ఇందుకు నిదర్శనం. జనసేన పార్టీ జత కలిసే ముందు వరకు జగన్ సీఎం అవుతాడని అన్ని అంతర్గత సర్వేలు చెప్పాయని, జనసేన మద్దతు ప్రకటించిన తర్వాతే ఫలితాలు పూర్తిగా తారుమారు అయిపోయాయని పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు, పలువురు రాజకీయ విశ్లేషకులు చాలా సార్లు చెప్పి ఉన్నారు.

2. సమస్యలను లేవనెత్తడం లో ట్రెండ్ సృష్టించిన పవన్ కల్యాణ్:

“నేను ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సృష్టిస్తాను” – ఇది ఒక పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్. సినిమాల విషయంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సృష్టించాడు. సాధారణంగా సంప్రదాయ రాజకీయ పార్టీలు ఎక్కువ మంది ఓటర్లను ప్రభావితం చేసే సమస్యలను మాత్రమే లేవనెత్తుతుంటారు. రైతుల సమస్యలు , డ్వాక్రా మహిళల సమస్యలు – ఇలా ఎక్కువ మందికి అన్వయించే సమస్యలపై మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ మొదటి రోజు నుండి కూడా, ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, శెట్టిపల్లి వంటి సమస్యలను ప్రస్తావించారు. తాను లేవనెత్తిన చిన్న చిన్న సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేంత వరకు పోరాడారు. ఒక సమస్య పరిష్కారం చేస్తే ఎన్ని ఎక్కువ ఓట్లు వస్తాయన్నది తనకు ముఖ్యం కాదని, సమస్యలు పరిష్కరించడమే తనకు ముఖ్యమని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్లో నిజాయితీ చాలామందిని ఆకట్టుకుంది. పట్టుమని పది వేల మందిని కూడా ప్రభావితం చేయని ఇలాంటి సమస్యలను పవన్ కళ్యాణ్ ఎందుకు లేవనెత్తుతున్నాడు అంటూ ప్రతిపక్ష నాయకులు సైతం విమర్శలు చేశారంటే, పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సృష్టించిన ట్రెండ్ వారిని ఎంత ఇబ్బంది పెట్టిందో అర్థమవుతుంది.

3. ప్రత్యేక హోదా ని సజీవంగా ఉంచడం:

2014లో మోడీ సొంతంగా పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించి అధికారం చేపట్టిన తర్వాత, ఒక కాంగ్రెస్ మినహాయించి ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు బిజెపి ని విమర్శించడానికి వెనుకాడారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రత్యేక హోదా మీద బిజెపి వెనక్కి తగ్గినప్పటికీ అటు అధికార తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కానీ బిజెపి పై మాట్లాడడానికి సాహసం చేయలేకపోయాయి. అలాంటి సందర్భంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బిజెపి మీద తిరుగుబాటు చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ అప్పట్లో చరిత్ర సృష్టించాడు. బీజేపీ మీద రాష్ట్రంలో ఈ తరహా వ్యతిరేకత రావడానికి మొట్టమొదట బీజం వేసింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తిరుపతి , కాకినాడ సభలలో బీజేపీని ఏకేసిన తర్వాతే , జగన్ కూడా ప్రత్యేక హోదా మీద గళమెత్తాడని రికార్డులు చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఆ రకంగా ప్రత్యేక హోదా అనే అంశం ఆంధ్రప్రదేశ్ లో సజీవంగా ఉంచడానికి కారణం పవన్ కళ్యాణ్.

4. అవిశ్వాస తీర్మానం ద్వారా రాజకీయ సమీకరణాలు మార్చి వేసిన పవన్ కళ్యాణ్:

గత ఏడాది ఫిబ్రవరిలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా సమస్య కోసం తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ గనక రాజకీయాల్లో లేకపోయి ఉంటే, వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉండేవారు, టిడిపి మోడీతో సహా ఎన్డీయే లో ఉండిపోయేది, ఇప్పుడు అభివృద్ధి నినాదంతో మోడీ చంద్రబాబు కలిసి మళ్ళీ ఎన్నికలకు ఎన్నికలకు వెళ్లి ఉండేవారు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి, జగన్మోహన్ రెడ్డి ని, ఎంపీ పదవులకు రాజీనామా చేయడం కాదు, దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టు అని రెచ్చగొట్టడంతో ట్రాప్ అయిన జగన్, అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిర్ణయించుకున్నారు. దీంతో ఆ క్రెడిట్ వైఎస్ఆర్సిపి ఇవ్వకూడదన్న ఉద్దేశంతో వారికంటే ముందు టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. చూడడానికి ఇది పవన్ కళ్యాణ్ క్రెడిట్ తీసుకోవాల్సిన అంశం కాదు అని సామాన్యులకు అనిపించినప్పటికీ, ఒకసారి ఈ వ్యవహారం అంతటి నుంచి పవన్ కళ్యాణ్ ని మినహాయించి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది.

5. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరడం:

రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు సహజం. తన మీద చేస్తున్న కుట్రలను బలంగా తిప్పి కొట్టడమే కాకుండా, ఏ రాజకీయ పార్టీ ట్రాప్ లో పవన్ కళ్యాణ్ చిక్కుకోకుండా ఐదేళ్లపాటు పార్టీ ని నడిపించడం సామాన్య విషయం కాదు. అది కూడా బలమైన మీడియా అండ లేకుండా పార్టీని ఇంతవరకు తీసుకు రావడం అన్నది గొప్ప విషయమే. గత ఏడాది జనవరి నుంచి మార్చి నెలలలో ఏ మీడియా చూసినా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే కొంతమంది కుహనా మేధావుల ఇంటర్వ్యూలతో నిండిపోయేది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా రూపొందిన ఒక మహా స్కెచ్ ని , బలంగా తిప్పి కొట్టడమే కాకుండా, ఈరోజు పవన్ కళ్యాణ్ మీద నెగటివ్ ప్రోగ్రాం చేయాలంటేనే ఛానళ్లు భయపడే స్థితికి పవన్ కళ్యాణ్ తీసుకువచ్చాడు అంటే అది ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలలో పవన్ కళ్యాణ్ ఆరితేరిపోయాడు అన్న విషయాన్ని సూచిస్తుంది.

6. మీడియా సపోర్ట్ లేకుండా పార్టీ బతకదు అన్న అంచనాలను తలకిందులు చేయడం:

ఏ పార్టీ అయినా మీడియా సపోర్ట్ లేకపోతే బతకదు అని ఏడాది క్రితం ఊహించిన వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ పార్టీని నిలబెట్టిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.

సాధించలేకపోయినవి ఏంటి ?

అయితే పవన్కళ్యాణ్ సాధించలేకపోయిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు జనసేన పార్టీకి ఓటు వేసే వారిని చూస్తే ప్రధానంగా కొన్ని కేటగిరీల వారు కనిపిస్తారు. సంఖ్యాపరంగా తాము అధికంగా ఉన్నప్పటికీ రాజకీయ అధికారం పొందలేక పోయాం అన్న అవగాహన కి వచ్చిన కాపు సామాజిక వర్గం వారు, గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఓటు వేసిన వారు, గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఓటు వేయకపోయినా మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలకు అభిమానులుగా ఉన్న వారు, మెగా హీరోలతో సంబంధం లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ కి సినిమా పరంగా అభిమానులు కాకపోయినప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ రాజకీయ ఆశయాలను చూసి ఆకర్షింపబడిన వారు. అయితే ఈ నాలుగు వర్గాలలో లో అత్యల్ప సంఖ్యలో ఉన్నది ఆఖరి వర్గం వారే. అంటే ఇది వరకే మెగా ఫ్యామిలీ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ ఏదో ఒక రకంగా అభిమానం కలిగిన వారు కాకుండా కొత్తగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల పట్ల ఆకర్షితులైన వారు చాలా తక్కువ అన్నమాట. ఇలా కొత్తగా ఎక్కువమందిని తమ పట్ల ఆకర్షిత అయ్యేలా చేసుకోవడం లో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారు. అయితే అదే సమయంలో ఇదివరకే ఎంతో కొంత అభిమానం కలిగిన వారు మాత్రం ఈ సారి కచ్చితంగా జనసేనకు ఓటు వెయ్యాలి అనుకునేలా చేయడంలో మాత్రం 100% సక్సెస్ అయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు పరిస్థితి ఈ విధంగా లేదు, చాలా మంది చిరంజీవి అభిమానులు కూడా అప్పట్లో ఇతర పార్టీలకు ఓటు వేశారు.

ఇక రెండవ వైఫల్యం- ప్రత్యేక హోదాను ఉద్యమ స్థాయికి తీసుకు వెళతారని పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్న ఆశలను వమ్ము చేయడం. అరవింద్ కేజ్రీవాల్ లోక్పాల్ సమస్యపై ఉద్యమం చేసినట్లుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా మీద ఉద్యమం చేసి ఉన్నట్లయితే ఈరోజు జనసేన విజయం మీద ఏ ఒక్కరికి ఒక్క శాతం కూడా అనుమానం ఉండేది కాదు.

ఇక మూడవ వైఫల్యం, పూర్తిస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో నాయకులు ఏర్పాటు చేసుకోలేక పోవడం. పాత తరం నాయకులను కాదని తాను కొత్త తరం నాయకులను నిర్మించ దలుచుకున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఎన్నికలకు నెల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో నాయకులు లేకపోవడం అన్నది వైఫల్యమే. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం హంగ్ ప్రభుత్వం వస్తుందని భావిస్తున్నారు తప్పించి పవన్ కళ్యాణ్ 88 సీట్లు సాధిస్తాడని భావించడం లేదు. కానీ సొంతంగా 88 స్థానాలు సాధిస్తాడు అన్న భరోసా కల్పించడంలో కూడా పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని చెప్పుకోవాలి.

మొత్తం మీద :

సైన్స్ లో “ఎస్కేప్ వెలాసిటీ” అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రాకెట్ లాంచ్ చేసేటప్పుడు, మొదట్లో భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల రాకెట్ అత్యంత ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది, ఆ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించడానికి “ఎస్కేప్ వెలాసిటీ” ని మించిన వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకసారి ఆ గురుత్వాకర్షణ ప్రభావాన్ని దాటిన తర్వాత రాకెట్ ప్రయాణం సాఫీగా ఉంటుంది. మొదటి సారి ఎన్నికల్లో తలపడుతున్న జనసేన పార్టీ కూడా అనేకానేక సమస్యలను ప్రభావాలను దాటుకుని, ఇప్పటికే బలంగా స్థిరపడ్డ పాత పార్టీలని ఢీ కొనాల్సి ఉంది. ఎక్కడా సెల్ఫ్ గోల్ వేసుకోకుండా, ఎక్కడా ట్రాప్ అవ్వకుండా, అభిమానులను నిరుత్సాహ పరచకుండా, రాజకీయాల్లో మార్పు తీసుకు వస్తాడు అని భరోసాను కల్పిస్తూ ఇక్కడి దాకా పార్టీ తీసుకురావడం లో, “ఎస్కేప్ వెలాసిటీ” ని సాధించడానికి రాకెట్ పడేంత కష్టం పడుతూ, పార్టీని నిర్మించుకోవడంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా విజయం సాధించారని చెప్పవచ్చు. మరి ఎన్నికల్లో ఎలాంటి విజయం సాధిస్తాడు అన్నది మే 23న తెలుస్తుంది.

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close