నాని HIT 3 సినిమాపై కాపీరైట్ వివాదం చుట్టుముట్టింది. రచయిత విమల్ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే… విమల్ ఓ కథను 2021 ఆగస్టు 4న దక్షిణ భారత సినిమా రచయితల సంఘంలో రిజిస్టర్ చేశాడట. 2022 ఆగస్టు 8న ఆ కథ సినాప్సిస్‌ను నానికి పంపాడు. అయితే, తనకు ఎటువంటి స్పందన రాలేదు.
HIT 3 సినిమా విడుదలైన తర్వాత థియేటర్లో చూసినపుడు అది తాను రాసిన కథ ఆధారంగా తీసినట్టు స్పష్టంగా గుర్తించానని విమల్ అంటున్నాడు. “సినిమాలో ఉన్న కథా హంగాలు, పాత్రలు, కేరెక్టర్ డెవలప్మెంట్ ఇవన్నీ నా స్క్రిప్ట్ లానే ఉన్నాయి. చిన్న మార్పులతో కథను మార్చారు’ అనేది విమల్ ఆరోపణ.
ఈ నేపథ్యంలో విమల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయన కాపీరైట్ ఉల్లంఘనను గుర్తించి HIT 3 చిత్రానికి సంబంధించి హక్కుల విక్రయాన్ని నిలిపివేయాలని, సినిమా వలన వచ్చిన లాభాల్లో 20% నష్ట పరిహారంగా చెల్లించాలని, పూర్తిగా లాభాల ఆకౌంటింగ్ రిపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాడు.
విమల్ వాదనలపై న్యాయమూర్తి సెంథిల్ కుమార్ రామమూర్తి స్పందించి, జూలై 7, 2025 లోపు సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. కేసును తదుపరి విచారణకు వాయిదా వేశారు. కేసు అత్యవసరమైనదని పేర్కొంటూ Commercial Courts Act సెక్షన్ 12A ప్రకారం మధ్యవర్తిత్వం నుంచి మినహాయింపు కూడా కోరారు. ఈ వ్యవహారం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌పై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ కేసు ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.