Squid Game 3 review
‘స్క్విడ్ గేమ్’… ఇది కేవలం ఓ ఆట అయితే ప్రపంచం ఇంతలా మాట్లాడుకునేది కాదు. ఇదొక బతుకు పోరాటం. జీవితంలో సర్వం కోల్పోయిన కొందరు మళ్లీ కొత్తగా జీవించడానికి ప్రాణాన్నే పణంగా పెట్టిన ఆటవి యుద్ధం. ఆ రంగులు నిండిన ఆట స్థలాల్లో వేల ప్రాణాలు ఆవిరైపోయాయి. డబ్బు, నిస్సహాయత, కలలు, ఆశ, దురాశ, బాధలు… ఒక్కటీ కాదు, జీవన పోరాటం అంతా ఈ గేమ్‌లో కనిపిస్తుంది. ప్రాణాలని పణంగా పెట్టి ఆడే ఈ ఆట కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు… ఎన్నో జీవితాల యదార్థాన్ని, మనుషుల మనస్తత్వాన్ని ఒళ్లు జలదరించేలా ఆవిష్కరించింది. రెండు విజయవంతమైన సీజన్స్ తర్వాత తాజాగా ఫైనల్ సీజన్ రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. ఈ ఫైనల్ సీజన్లో ఆటకి ఎలాంటి ముగింపు ఇచ్చారు? ఎవరు గెలిచారు? ఎవరు నిలిచారు?
‘స్క్విడ్ గేమ్’ సీజన్–1 విన్నర్ షియెంగ్ జీ హున్ (లీ జంగ్–జే) ఇలాంటి క్రూరమైన ఆటను అంతం చేయాలనే నిర్ణయానికి వస్తాడు. తన ప్రైజ్ మనీతో కావాల్సిన ఆయుధాలను సమకూర్చుకొని ఆ ఆటను ఆడించే నిర్వాహకులను గాలిస్తాడు. కానీ ఎంతకీ వారి జాడ కనిపించదు. దీంతో మళ్లీ ఆ గేమ్ లో ఆటగాడిగా వెళ్తాడు. ఆటలో ప్రవేశించిన తర్వాత అదును చూసుకొని నిర్వహకులపై దాడి చేస్తాడు. అయితే అతడి ప్రయత్నం విఫలం అవుతుంది. జీ హున్ కారణంగా పదుల సంఖ్యలో ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోతారు. ఇక్కడితో సీజన్ 2 ఆగింది. అలా దెబ్బతిన్న జీ హున్ తర్వాత గేమ్ ను ఎలా కొనసాగించాడు? చివరికి ఈ ఆటలో విజేతగా నిలిచింది ఎవరు? ఈ ప్రాణంతకమైన ఈ ఆటకు ఎలాంటి ముగింపు దొరికింది? అనేది తక్కిన సిరీస్.
అన్నిటికంటే విలువైనది జీవితం. కానీ ఆ జీవితాన్ని నడపాలంటే డబ్బు అనే ఇంధనం కావాలి. అయితే జీవితం కంటే డబ్బే విలువైపోతే… అప్పుడు అసలైన ఆట మొదలౌతుంది. ఆ ఆట ఎంత క్రూరంగా ఉంటుంది? మనిషి ఎంత ఆటవికంగా మారిపోతాడు? ఆశతో ఊగిసలాడే మనిషి, ఇక జీవితమే ఉండదనుకున్నప్పుడు ఎంత దుర్మార్గానికి దిగుతాడు? ఒకడి చావు మరొకరికి ఎలా వినోదంలా మారిపోతుంది? ఇలా మనిషి అంతరాల్లోకి వెళ్లి, ఆ చీకటిని టార్చ్ వేసి చూపించిన సిరీస్ ఇది.
ఫైనల్ సీజన్లో ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి గంటకు పైనే. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. రెండు సీజన్లు ఫాలో అయిన వారు మూడో సీజన్‌ను సింగిల్ సిట్టింగ్‌లో చూసేస్తారు. అంత ఎంగేజింగ్‌గా ఉంది ఫైనల్ సీజన్. ముందుగా దర్శకుడు హ్యాంగ్ డాంగ్ హ్యుక్ను మెచ్చుకోవాలి. ఈ షోను రాసిన విధానం మామూలుగా లేదు. నిజానికి ఇలాంటి ‘గేమ్’ షో రాయడం ఈజీ అనుకుంటారు కానీ కనిపించేటంత సులువు కాదు ఇది. ఫైనల్ సీజన్లో కేవలం మూడు ఆటలే ఉంటాయి. కానీ ప్రేక్షకుడు ఆటల సంగతి మర్చిపోతాడు. అక్కడి పాత్రలు, వారి మనస్తత్వానికి కనెక్ట్ అయిపోతాడు. మనడుగడ కోసం చేసే పోరాటంలో హ్యూమన్ సైకాలజీని దర్శకుడు ఆవిష్కరించిన తీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
ఫస్ట్ ఎపిసోడ్ తోనే తాళాలు కత్తుల ఆట మొదలైపోతుంది. ఈ సిరీస్ ను ఎక్కువగా ప్లేయర్ నంబర్ 456 జీ హున్తోనే ఫాలో అవుతారు ఆడియన్స్. సీజన్ 2లో అతడికి తగిలిన దెబ్బ, తన కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటన జీ హున్‌ను బాధిస్తుంది. మొదటి రెండు ఎపిసోడ్లు… ఇన్ యాక్టివ్ గానే ఉంటాడు. ఈ రెండు ఎపిసోడ్లలో మిగతా క్యారెక్టర్ సైకాలజీపై ఎక్కువ దృష్టి పెట్టాడు దర్శకుడు. ఇందులో తల్లి–కొడుకు, గర్భిణీ స్త్రీ ప్లేయర్ 222, ట్రాన్స్‌జెండర్, డ్రగ్ ఎడిక్ట్, ఆత్మలతో మాట్లాడే ప్లేయర్… ఈ పాత్రలన్నీ కావాల్సినంత డ్రామా క్రియేట్ చేశాయి. మూడో ఎపిసోడ్ ‘ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్’తో ప్లేయర్ నంబర్ 456 మళ్లీ యాక్టివ్‌గా ఆటలోకి వస్తాడు. నవజాత శిశువును చివరి వరకూ కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. అక్కడి నుంచి ఈ గేమ్ మరోస్థాయికి వెళుతుంది.
నిజానికి పాపను కూడా ఆటలో భాగం చేయడం మాటలకందని విషాదం. కానీ దర్శకుడు మనుషుల్లోనే చీకటిని ధైర్యంగా చూపించడానికి వెనకడుగు వేయలేదు. ఆ పాప చుట్టూ 222 అనే ఒక ఎపిసోడ్ రాశాడు. అది ఈ గేమ్ ఫినిష్ చేయడానికి మంచి లీడ్ అయ్యింది. ఇక ఫ్రంట్ మ్యాన్ క్యారెక్టర్‌ను కూడా బాగా డీల్ చేశారు. సీజన్ 3లో కొన్ని లోపాలు కూడా కనిపిస్తాయి. గత సీజన్లో ఆటను ఆస్వాదించే రిచ్ పీపుల్… చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా కనిపిస్తారు. కానీ ఈ సీజన్లో వాళ్ల తీరు అంత సాలిడ్‌గా ఉండదు. దీని కారణంగా కొంత ఎఫెక్ట్ తగ్గింది. ఆట స్థలాన్ని పసిగట్టడానికి డిటెక్టివ్ పాత్ర చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి కానీ… ఆటలో రెబల్ మారిన ఓ అమ్మాయి పాత్ర అంత కనెక్టింగ్‌గా ఉండదు.
ప్లేయర్ నంబర్ 456గా జీ హున్ మరోసారి కట్టిపడేశాడు. ఈ సీజన్ అతని నటనకి ఒక ఛాలెంజ్. అతని క్యారెక్టర్లో చాలా డైలెమా ఉంటుంది. దాన్ని స్క్రీన్‌పై చూపించడం అంత ఈజీ కాదు. కొన్ని సీన్లలో జీ హున్ ఏం ఆలోచిస్తుంటాడు? తన మనసులో ఏం అనుకుంటున్నాడో… అలా చూస్తూ ఉండిపోతాం. అంత మాగ్నటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫ్రంట్ మ్యాన్ ఇన్ హోగా నటించిన లీ బ్యూఙ్–హున్ కూడా అదరగొట్టాడు. నిజానికి ఈ కథను తన యాంగిల్ నుంచి చెప్పుకుంటూ వస్తే మరో కొత్త సిరీస్‌ను క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మిగిలిన పాత్రలు కూడా గుర్తుండిపోయేలా ఉంటాయి. టెక్నికల్‌గా సిరీస్ గత సీజన్ల మాదిరిగానే టాప్ క్వాలిటీతో ఉంది.
ఇలాంటి కథలను ముగించడం అంత తేలిక కాదు. దర్శకుడు ఈ సిరీస్‌ను మనిషి, మానవత్వం మిగలాలనే ఉద్దేశంతో రాశాడు. ఇలాంటి కథకు విషాదమైన ముగింపే ఉంటుంది. అయితే ఈ విషాదం మానవత్వాన్ని బతికించేలా ఉండటం మంచి విషయం.