పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ జూలై 24 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పవన్‌తో ఖుషి, బంగారం సినిమాలు తీసిన ఎ.ఎం. రత్నం నిర్మించిన సినిమా ఇది. సినిమా పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న రత్నానికి ఈ సినిమా మాత్రం ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఆయన కెరీర్లో ఇంత సుదీర్ఘ కాలం ప్రొడక్షన్ జరుపుకున్న సినిమా ఇదే. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రాజెక్ట్‌ని చాలా కాన్ఫిడెంట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా ఆలస్యమవడంతో ఎలా ఉంటుందోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ట్రైలర్‌తో సినిమాపై ఉన్న కొన్ని అనుమానాలు తొలిగాయి. మంచి బజ్ వచ్చింది.
తాజాగా నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ సినిమా గురించి చెప్పిన మాటలు మరింత ఆసక్తిని పెంచాయి. ‘‘పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. పవన్ గారి అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. సెట్స్, గ్రాఫిక్స్‌తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఆలస్యమైంది. నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెప్తున్నాను… హరిహర వీరమల్లు ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.’’ అని చెప్పుకొచ్చారు రత్నం.
అలాగే ప్రీమియర్ షోలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ‘‘జూలై 24 తెల్లవారుజాము నుంచి షోలు వేయాలని మేము భావించాము. కానీ అభిమానులు ముందురోజు రాత్రి నుంచే షోలు వేయాలని కోరుతున్నారు. వారి కోరిక మేరకు జూలై 23 రాత్రి నుంచి షోలు వేసే ఆలోచనలో ఉన్నాము’’ అని వెల్లడించారు.