రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఇంకా ఆయన సమస్యను టేకప్ చేయలేదు. రోజూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు. అయినా ఇప్పటి వరకూ ఆయనకు నోటీసులు ఇవ్వడం కానీ.. హెచ్చరికలు జారీ చేయడం కానీ చేయలేదు గత ఆదివారం మల్లు రవి నేతృత్వంలో క్రమశిక్షణా కమిటీ సమావేసమైనప్పుడు ఆయనపై ఫిర్యాదులేమీ లేవని చెప్పడంతో రాజగోపాల్ రెడ్డికి మరింత ధైర్యం వచ్చింది.
తాజాగా ఆయన పదవులు మీరే.. పైసలూ మీరే తీసుకుంటారా అని రేవంత్ పై విమర్శలు గుప్పించారు. ఆయన రాను రాను డోస్ పెంచుకుంటూ పోతున్న వైనం కలకలం రేపుతోంది. ఆయనపై ఏ చర్యలు ఉండవా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి పీసీసీ చీఫ్ కు ఎదురవుతోంది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యవహారాన్ని క్రమశిక్షణా కమిటీ పరిశీలించాలని ఆదేశించామని ఆయన చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారో తెలుసుకుంటామన్నారు.
రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం ఏమిటో టీపీసీసీ చీఫ్ కు తెలియనిదేం కాదు. కానీ ఆయనపై చర్యల విషయంలో ఏమీ స్పందించలేని పరిస్థితి . సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నా.. ఆయన సోదరుడు కూడా ఆపలేకపోతున్నారు. తాను తన సోదరుడ్ని కంట్రోల్ చేయలేనని కావాలంటే తన మద్దతు రేవంత్ కే ప్రకటిస్తానని ఆయన ప్రకటించడమే కాదు.. రేవంత్ కోసం పూజలు కూడా చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ స్వయంగా చర్యలు తీసుకోలేరు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆయనకు హెచ్చరికలు జారీ చేయకపోవడం చర్చనీయాంశమవుతోంది.
ఆయనపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తే.. రోజు రోజుకు డోస్ పెంచుకుంటూ పోతారని.. అంతిమంగా అది పార్టీకే నష్టమని .. రేవంత్ వర్గీయులు అంటున్నారు.