తేజా సజ్జా టైమ్ నడుస్తోంది. తన కష్టం, అదృష్టం రెండూ పక్క పక్కనే కలిసి నడుస్తున్నాయి. అందుకే వరుస హిట్లు అందుకొంటున్నాడు. `హనుమాన్`తో మూడొందల కోట్ల సినిమా అందించిన తేజా.. ఇప్పుడు ‘మిరాయ్`తో మరో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాకు అంతటా పాజిటీవ్ బజ్జే వినిపిస్తోంది. టాక్ బాగుంది. రివ్యూలు బాగున్నాయి. వసూళ్లూ జోరందుకొంటున్నాయి. ఇలాంటి తరుణంలో హీరోలకు కొత్త కథల్ని ఎంచుకోవడం, తరవాత సినిమా ఏమిటో నిర్ణయించుకోవడం కాస్త కష్టం అవుతుంటుంది. కానీ తేజా సజ్జాకు ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే… తన చేతిలో అన్ని మంచి ఫ్రాంచైజీలు ఉన్నాయి.
జాంబీరెడ్డి, హనుమాన్, మిరాయ్… ఇవి మూడూ ఫ్రాంచైజీలే. ‘జాంబీ రెడ్డి 2’ త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. మిరాయ్ తరవాత తేజా చేయబోయే సినిమా ఇదే. ‘హనుమాన్ 2’ ఎలాగూ ఉంది. ఈ సినిమాలో తేజా సజ్జా పాత్ర ఏమిటన్న విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినా.. తేజా సజ్జా ఉండడం ఖాయం. ఇప్పుడు మిరాయ్ 2కి ద్వారాలు తెరచుకొన్నాయి. మిరాయ్ హిట్టయితే, సీక్వెల్ ఉంటుందని తేజా ముందే చెప్పాడు. దానికి తగ్గట్టుగానే ‘మిరాయ్’ క్లైమాక్స్ లో పార్ట్ 2కి లీడ్ దొరికింది. ఇంత మంచి హిట్ వచ్చాక సీక్వెల్ చేయడం ఖాయం. సో.. తేజా చేతిలో వరుసగా సీక్వెల్సే ఉన్నాయి. ఈలోగా కొత్త కథలు దొరికితే ఓకే. లేదంటే పార్ట్ 2లతోనే మూడేళ్లు గడిపేయొచ్చు.