అసలే ఆర్థిక సమస్యల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఒకరి తర్వాత ఒకరు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు బకాయిలు ఉన్నాయని కాలేజీలు అన్నీ బంద్ ప్రకటించాయి. ఇంజినీరింగ్ కాలేజీన్నీ మూసేశారు. దాదాపుగా ఎనిమిది వేలకోట్ల బకాయిలు ఉన్నాయని తాము కనీసం సిబ్బందికి ఫీజులు చెల్లించలేకపోతున్నామని వారంటున్నారు. ప్రభుత్వం చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.
ఇప్పుడు అత్యవసరంగా కాలేజీల్ని తెరిపించాల్సిన బాద్యత ప్రభుత్వంపై పడింది. ఎంతో కొంత డబ్బులు ఇస్తే తప్ప వారు కాలేజీలు తెరువరు. ఈ సమస్యపై శ్రీధర్ బాబు, భట్టిలతో రేవంత్ చర్చలు జరిపారు. వీరు ఇలా ఈ సమస్యపై చర్చిస్తూండగానే.. ఆస్పత్రులు రంగంలోకి వచ్చేశాయ. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేస్తూ పోవడమే కానీ ప్రభుత్వం వైపు నుంచి బకాయిలు వచ్చేది కనిపించడం లేదని వారు కూడా బంద్ ప్రకటన చేసేశారు. మంగళవారం నుంచి పేదలకు ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు.
ఇవాళ్టికి విద్య, వైద్య రంగానికి సవాళ్లు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. వీరికి నిధులు ఇస్తారని క్లారిటీ వస్తే.. ప్రభుత్వం నుంచి డబ్బులు రావాల్సిన వాళ్లు కూడా రంగంలోకి దిగుతారు. అప్పుడు ప్రభుత్వానికి మరిన్ని నిధులు అవసరం అవుతాయి. డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పి వారికి సర్ది చెప్పలేరు. ఇప్పటికిప్పుడు తెచ్చి ఎంతో కొంత వారికి చెల్లించలేరు. మొత్తంగా సీఎం రేవంత్ కు ఆర్థికంగా అసలైన సవాళ్లు ఎదురవుతున్నాయి.
