ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వచ్చే ఎన్నికల నుంచి ఇక తాను పోటీ చేయనని ప్రకటించారు. ఒంగోలులో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో ఆయనీ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల నుంచి తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ ఎన్నికల్లోనే రాఘవరెడ్డి పోటీ చేయాల్సి ఉన్నా.. చంద్రబాబు ఆదేశాలతో తానే పోటీ చేశానని మాగుంట చెబుతున్నారు.
మాగుంటకు ఇటీవల ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు.గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అయితే ఆయన గత ఎన్నికల్లోనే పోటీ నుంచి వైదొలగాలనుకున్నారు. ఆయన కుమారుడ్ని లైన్ లోకి తీసుకు వచ్చారు. కానీ మాగుంట రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలుకు పోవడంతో సీన్ రివర్స్ అయింది. అప్రూవర్ గా మారి ఎలాగోలా బెయిల్ తెచ్చుకున్నారు కానీ.. ఎన్నికల సమయంలో ఆ వివాదం ఇంకా లైవ్ లోనే ఉంది. పైగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. అందుకే మాగుంటతోనే పోటీ చేయించారు.
మాగుంట సుబ్బరామిరెడ్డి ఒకప్పుడు ప్రకాశం, నెల్లూరు రాజకీయాల్లో కీలకంగా ఉండేవారు. నక్సలైట్లు ఆయనను హత్య చేయడంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వివాద రహితుడిగా పేరున్న ఆయన వైసీపీలో ఎంపీగా ఉన్న సమయంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు.