దేశ ప్రధాన ప్రతిపక్ష నేత బాంబులేస్తున్నారు. చాలా రోజులుగా ఆయన ఇదిగో హైడ్రోజన్ బాంబు .. అదిగో నైట్రోజన్ బాంబు అని చెబుతూనే ఉన్నారు. ఆ బాంబులు ప్రకటించగానే అల్లకల్లోలం రేగుతుందని చెబుతూ ఉంటారు. కానీ ఆయన ఇప్పటి వరకూ మూడు ప్రెస్ మీట్లు పెట్టి మూడు భయంకరమైన బాంబులు ప్రయోగించారు. భయంకరమైన నిజాలతో కూడిన బాంబులు అని ఆయన అనుకున్నారు. ఇతరులెవరు అనుకోలేదు. అనుకోవాల్సిన జనం అనుకోలేదు. అక్కడే సమస్య వస్తోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన ఓట్ల చోరీ నెరేటివ్‌ను ఎవరూ నమ్మడం లేదు. అందుకే స్పందన ఉండటం లేదు. కానీ కాంగ్రెస్ లేదా రాహుల్ గాంధీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా..తమ దారిన తాము రాజకీయాలు చేస్తున్నారు.
హర్యానా హైడ్రోజన్ బాంబు – కనీసం సౌండ్ చేయలేదేం ?
హెచ్ ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ ప్రకటించిన హర్యానా పాతిక లక్షల ఓట్ల చోరీ కథ కామెడీగా ముగిసిపోయింది. ఆయన చాలా బండిల్స్ ఓ ట్రాలీ మీద పెట్టుకొచ్చి ఇవే ఆ పాతిక లక్షల దొంగ ఓట్లు అని ప్రకటించారు. అన్ని వివరాలు చెప్పి.. ఓ బ్రెజిల్ మోడల్ ఇరవై రెండు సార్లు ఓట్లు వేసిందన్నారు. అక్కడే ఆయన ఎంత సీరియస్ గా ఓట్ల చోరీ మీద కసరత్తు చేశారో అర్థం అయిపోతుంది. దొంగ ఓట్లు వేయించడానికి ఎవరైనా బ్రెజిల్ మోడల్ ను మాట్లాడుకుంటారా…అది కూడా ఆమె బూతులు తిరిగి తిరిగి ఇరవై రెండు ఓట్లు వేస్తారా?. నిజంగా అలాంటి దొంగ ఓట్లు వేసే అవకాశం ఉంటే .. ప్రొఫెషనల్స్ మన దేశంలో లక్షల మంది ఉంటారు. అంత మాత్రం దానికి బ్రెజిల్ నుంచి తెచ్చుకుంటారా?. ఈ చిన్న లాజిక్ రాహుల్ మిస్సయ్యారు..కానీ జనం మిస్ కాలేదు.
ఇప్పటికి మూడు సార్లు బాంబులేశారు.. ఎఫెక్ట్ ఎంతో సమీక్ష చేసుకున్నారా?
రాహుల్ గాంధీ రాజకీయాన్ని రాజకీయంగా చేయడం లేదు. ఆయన బీజేపీపై పోరాడాల్సిందిపోయి.. ఎన్నికల సంఘం మీద పోరాడుతున్నారు. అదే రాంగ్ ట్రాక్. మొదట్లో ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఓట్ల చోరీ అంటున్నారు. మన దేశంలో ఓటర్ జాబితా అనేది పబ్లిక్ డాక్యుమెంట్. రాజకీయ పార్టీలన్నింటికీ ఎన్నికల సంఘం ఇస్తుంది. ఎవరి ఓటు లేకపోయినా వెంటనే తెలిసిపోతుంది. అందుకే ఓట్ల గల్లంతు అనే మాట ఎన్నికలు జరిగితే పెద్దగా వినిపించడం లేదు. దొంగ ఓట్లు అనే మాట కూడా లేదు. ఎందుకంటే.. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా పెరిగిపోయింది. దొంగ ఓటర్లు వేస్తే సులువుగా పట్టేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన ఎన్నికల్లో దొంగ ఓటర్లను మీడియానే పట్టుకుంది. అందుకే రాహుల్ గాంధీ చేస్తున్న పరిశోధనా ఫలితాల ప్రకటనలు ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించడం లేదు.
ఓడిపోయాక ఎన్ని మాటలు చెప్పినా వృథా – రాహుల్‌కు ఎవరూ చెప్పరా?
రాహుల్ గాంధీ తమ ఓటములకు ఎన్నికల సంఘాన్ని బాధ్యుల్ని చేయాలనుకుంటున్నారు. ప్రజలు తమను గెలిపిస్తున్నారని కానీ ఈసీ మాత్రం గెలవనీయడం లేదని ప్రజల్లో అభిప్రాయం కల్పించాలనుకుంటున్నారు. అలా కల్పించి యువత, జెన్ జెడ్ తరాన్ని రోడ్ల మీదకు తీసుకు వచ్చి..అల్లకల్లోలం సృష్టించాలనుకుంటున్నారు. అలా సృష్టిస్తే తనకు అధికారం వస్తుందని అనుకుంటున్నారు. కానీ భారత ప్రజాస్వామ్య బలాన్ని నెహ్రూ వారసుడు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఆయన ప్రజా మద్దతు కూడగట్టాలంటే.. ఇంకా విశాలంగా ఆలోచించాల్సి ఉంది. ఆ స్థాయి వచ్చినప్పుడే ఆయన మరింత తెలివైన నేతగా గుర్తింపు పొందుతారు.


