‘దేవదాస్’తో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు రామ్. దాదాపు 20 ఏళ్ల కెరీర్ చూశాడు. ఎంతోమంది హీరోయిన్లతో పని చేశాడు. అయితే ఎప్పుడూ తన కెరీర్లో… లవ్ లో పడ్డట్టు వార్తలు రాలేదు. ఏ హీరోయిన్ తోనూ లింకప్ చేస్తూ గాసిప్పులు పుట్టలేదు. అయితే తొలిసారి.. ఇలాంటి హాట్ వార్తలు బయటకు వచ్చాయి. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమా సమయంలో కథానాయిక భాగ్యశ్రీ బోర్సేతో రామ్ క్లోజ్ గా ఉంటున్నట్టు, ఇద్దరి మధ్య ప్రేమ కథ నడుస్తున్నట్టు గుసగుసలు వినిపించాయి. ఈ సినిమాలో రామ్ ఓ లవ్ సాంగ్ రాశాడు. ఆ పాటకు స్ఫూర్తి భాగ్యశ్రీనే అని రాస్తూ వార్తల్లో కాస్త మసాలా జోడించారు. ఈ విషయంపై రామ్ తొలిసారి స్పందించాడు.
”ఆ వార్తలన్నీ నిరాధారమే. ఎలా వచ్చాయో నాకు కూడా తెలీదు. ఈ సినిమాలో నేను పాట రాశా. కానీ అప్పటికి భాగ్యశ్రీని కథానాయికగా ఎంచుకోలేదు కూడా. ప్రస్తుతానికి నాకు ఎలాంటి లవ్ ఇంట్రెస్ట్ లేదు” అని క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో ఈ వార్తలన్నీ పక్కా పుకార్లే అని తేలిపోయాయి. ఓ సినిమా కోసం హీరో, హీరోయిన్లు కలిసి పని చేస్తున్నప్పుడు, ఆ జోడీ చూడ్డానికి కూడా బాగున్నప్పుడు.. ఇలాంటి వార్తలు రావడం సహజమే. కొన్నిసార్లు ఇలాంటి గాసిప్పులే సినిమాకు కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ తీసుకొస్తాయి. ‘ఆంధ్రా కింగ్’ విషయంలోనూ అదే జరిగి ఉండొచ్చు. ఈ సినిమా రామ్ కి మాత్రమే కాదు… భాగ్యశ్రీకి కూడా కీలకమే. తాను ఇప్పటి వరకూ చేసిన మూడు సినిమాలూ కమర్షియల్ గా పెద్ద వర్కవుట్ కాలేదు. కనీసం రామ్ సినిమాతో అయినా హిట్టు కొట్టాలని భావిస్తోంది భాగ్యశ్రీ. అటు రామ్ కూడా తన వరుస పరాజయాలకు బ్రేక్ వేయాలని అనుకొంటున్నాడు. ‘ఆంధ్రా కింగ్’ ఈనెల 27న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
