ఐబొమ్మ రవిని మరోసారి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఐదు రోజులు ప్రశ్నించారు. ఆయన నుంచి ఏం రాబట్టారో కానీ మీడియాకు మాత్రం చాలా లీకులు ఇచ్చారు. కస్టడీ అయిపోయాక ప్రెస్మీట్ కూడా పెట్టారు. అసలు సజ్జనారే మరోసారి మీడియా ముందుకు వస్తారని ప్రచారం చేశారు కానీ చివరికి ఏసీపీ మీడియా ముందుకు వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతా బాగున్నా ఆయన చేసిన నేరాలేమిటో మాత్రం ఖరాఖండిగా చెప్పలేకపోతున్నారు.
పైరసీ రవి చేయలేదు..కొన్నారు !
సినిమాలను రవి పైరసీ చేశారన్నదానికి ఆధారాల్లేవు. సీఎంఎస్ ద్వారా ఆయనే అప్ లోడ్ చేశారని చెబుతున్నారు. కానీ ఆ ఆధారాలు సేకరించడం చాలా కష్టమని కూడా పోలీసులు చెబుతున్నారు. రవి సినిమాలను పైరసీ చేయలేదని టెలిగ్రామ్ చానల్ ద్వారా కొనుగోలు చేశారని అంటున్నారు. అంటే ఎవరో పైరసీ చేసి ఇస్తే ఆయన కొనుగోలు చేశారు. వాటిని తన సైట్లలో అప్ లోడ్ చేసుకున్నారు. ఇక్కడ పైరసీ రవి చేయలేదు. రవి చేశారన్నదానికి ఆధారాల్లేవు. తన సైట్ల ద్వారా.. బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేశారన్నది మరో కేసు. కానీ ఇది ఎంత తీవ్రమైన కేసులో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. రవిపై పెట్టిన కేసుల్లో రెండు సెక్షన్లు తప్ప ఏమీ చెల్లవని ఆయన తరపు లాయర్లు అంటున్నారు.
ప్రచారం చేసుకుంటున్న పోలీసులు
ఐబొమ్మ రవిని పట్టుకున్నప్పటి నుండి పోలీసులు ప్రచారం కోసం పాకులాడుతున్నారు. ఆయన భార్య సమాచారం ఇచ్చిందని.. తామే ట్రిక్ చేసి పట్టుకున్నామని.. కస్టడీలో ఇలా చెప్పారని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అన్నీ మీడియా లీకులే. ఇక నేరుగా సజ్జనార్ ప్రెస్మీట్లు ఏర్పాటు చేశారు. సినీ పెద్దలందర్నీ పిలిపించుకుని వారితో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఇదేం వైపరీత్యం అనుకున్నారు అందరూ. ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. కస్టడీ ముగిసిన తర్వాత కూడా అలాగే ప్రెస్మీట్ పెట్టారు. కానీ ఈ సారి సజ్జనార్ రాలేదు.
పోలీసుల తీరు వల్లే రవికి ప్రజల నుంచి సపోర్ట్
రవి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వల్లనే ఆయనపై ప్రజల్లో సానుభూతి ఏర్పడుతోంది. ఆయన చేసిన తప్పు.. పట్టుకున్నారు. అలాంటప్పుడు సైలెంట్ గా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ పోలీసులు మాత్రం తాము పెద్ద హీరోయిజం ఎఫెక్ట్ సాధించామన్నట్లుగా ప్రచారం కోసం పాకులాడుతూండటంతో ప్రజలకూ విరక్తి వస్తోంది. ఇదేం పద్దతని అనుకుంటున్నారు. ఐదు రోజుల్లో చెప్పించలేని నిజాలు మరో ఐదు రోజులు కస్టడీకి తీసుకుని ఏం సాధిస్తారు?. రవి ఇండియా పౌరుడు కాదు..నేరం హైదరాబాద్లో చేయలేదు. ఎక్కడో విదేశాల్లో ఉండి అప్ లోడ్ చేసి ఉంటాడు. మరి హైదరాబాద్లో పట్టుకున్నారు కాబట్టి వారు నేరం ఇక్కడే చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కటి కాదు.. ఇంకా పెద్ద ఎత్తున పైరసీ సైట్లు ఉన్నాయి. మరి వాటి విషయంలో ఎందుకు ఈ స్థాయి చర్యలు తీసుకోరన్నది సామాన్య ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్.