” మీ అందం చీర లోనే ఉంది తప్ప , “ సామాన్లు ” కనపడే బట్టల్లో ఏమీ ఉండదు ”
“ దరిద్రపు ముండా ! ఇలాంటి బట్టలు వేసుకున్నావు ఏంటి ? కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా !?”
– ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ చేసిన కొన్ని అసభ్యకరమైన కామెంట్లు ఇవీ…
సందు దొరికితే చాలు. ప్రతి ఒక్కడూ ఓ మైక్ పట్టుకొని ఆడవాళ్ల దుస్తుల మీద కామెంట్లు చేసేయ్యడమే. ఎలా కనిపించాలి? ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అనేవి ముమ్మాటికీ వాళ్ల హక్కే అనే సంగతి ఈ సంప్రదాయ వాద ముసుగు వేసుకొన్న మేధావులకు ఎందుకు అర్థం కాదో తెలియడం లేదు. ఆడవాళ్ల వ్యక్తిత్వాన్నీ, సామర్థ్యాన్నీ, అందాన్నీ వేసుకొనే దుస్తుల్ని బట్టి జడ్జ్ చేయడం హీనాతి హీనమైన చర్య. ఇలా మాట్లాడే చాలామంది అడ్రస్స్ లేకుండా పోయారు. ఆనక.. మళ్లీ మీడియా ముందుకొచ్చి ‘సారీ’లు చెప్పారు. లెంపలేసుకొన్నారు. అయినా ఇలాంటి వాళ్ల మైండ్ సెట్ లో మార్పు రావడం లేదు.
ఆడవారి వస్త్రాధరణకూ, మీరు తీసిన సినిమాకూ ఏమైనా సంబంధం ఉందా? పోనీ శివాజీ ఇది వరకు నటించిన సినిమాల్లో హీరోయిన్లంతా నిండుగా చీర కట్టుకొని కనిపించిన వాళ్లేనా? ఈ సంప్రదాయినీ.. సుప్పినీ…. సుద్దపూసనీ.. లాంటి కామెంట్లు ఎందుకు… ఎవరి కోసం…?
ఏదోటి మాట్లాడాలి… మీడియా అటెన్షన్ తెచ్చుకోవాలన్న తీవ్రమైన కోరిక ఉంటేనే తప్ప…. ఇలా నోరు జారరు. తాను మాట్లాడిన మాటలు.. ఎంత వరకూ వెళ్తాయో, జనాల రియాక్షన్లు ఎలా ఉంటాయో శివాజీకి బాగా తెలుసు. వేదిక మీద కూడా ఆయన ఆ విషయాన్ని గుర్తించారు. `రేపట్నుంచి నా మీద పడతారు` అనే విషయం ఆయన గ్రహించే ఈ వ్యాఖ్యలు చేయగలిగారు. అంటే ఎంత ధైర్యం?
దుస్తుల విషయం మాట్లాడే అంశమే కాదు. పోనీ…. ఒక వేళ మాట్లాడినా భాష ముఖ్యం. `సామాన్లు..` అనే పదం శివాజీ లాంటి నటుడు వాడాల్సిన మాటేనా? `దరిద్రపు ముండా..` ఈ తిట్టేంటి? పోనీ… ఓ అమ్మాయి తనకు ఇష్టమైన దుస్తుల్లోనే బయటకు వచ్చిందనుకోండి.. నోటికొచ్చిన మాట వాడేస్తామా?
ఈమధ్య ఓ జర్నలిస్టు ఇలాంటి కామెంట్లే చేశాడు. వయసొచ్చిన కూతురు ఉండగా, ఇలాంటి డ్రస్సులేస్తారేంటి? అని ఇంటర్వ్యూలోనే అడిగేశాడు. దానికి ఆ నటి ధీటుగా సమాధానం ఇచ్చింది. సదరు పాత్రికేయుడ్ని మహిళా సంఘాలు కూడా గట్టిగా నిలదీశాయి. దాంతో సారీ చెప్పాల్సివచ్చింది. దానికంటే శివాజీ వాడిన భాష దారుణమైనది. హేయమైనది. ఇందుకు శివాజీ కూడా సమాధానం చెప్పుకోవాల్సిందే. శివాజీ ఒక్కడే కాదు. శివాజీ కామెంట్లు షేర్ చేస్తూ శివాజీని సపోర్ట్ చేస్తున్నవాళ్లందరూ సమాధానం చెప్పాల్సిన ఘడియలు తొందర్లోనే ఉన్నాయి.


