ప్రజాస్వామ్య దేవాలయం వంటి పార్లమెంట్లో దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చ జరగడం సహజమే కానీ, ఆధారాల్లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యం అవుతుంది. చైనా చొరబాటు అంశంపై రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు అటు ప్రభుత్వాన్ని, ఇటు రక్షణ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. మాజీ సైన్యాధిపతి ఎం.ఎం. నరవణే రాసినట్లుగా చెబుతున్న ప్రచురించని పుస్తకంలోని అంశాలను, ఒక పత్రికా కథనాన్ని ఆధారంగా చేసుకుని రాహుల్ మాట్లాడటం సభా నియమాలకు విరుద్ధమని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేసినా, ఆయన వెనక్కి తగ్గలేదు. జాతీయ భద్రత వంటి అత్యంత గోప్యంగా ఉంచాల్సిన విషయాలను రాజకీయ లబ్ధి కోసం పార్లమెంట్ సాక్షిగా రచ్చ చేయడం దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సైన్యం మనోధైర్యం దెబ్బతీసేలా రాహుల్ ఆరోపణలు
చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని, దీనిపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యాధిపతికి ఇచ్చిన ఆదేశాలను తాను సభలో చదువుతానని రాహుల్ పట్టుబట్టడం వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రచురణకు కూడా నోచుకోని, ధ్రువీకరణ లేని పుస్తకంలోని సారాంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడం చట్టబద్ధంగా చెల్లదు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ.. రాహుల్ వ్యాఖ్యలు అవాస్తవాలని, సైన్యాధిపతి ఎన్నడూ అలాంటి మాటలు అనలేదని స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరించి సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతకు తగదని ఆయన హితవు పలికారు.
ప్రపంచదేశాల ముందు భారత్‌ను బలహీనం చేసేస్తారా?
దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు, సరిహద్దుల్లోని వ్యూహాలు బహిరంగ పరచడం అనేది శత్రు దేశాలకు మేలు చేసే చర్యగా మారుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 1962 యుద్ధం నాటి చారిత్రక తప్పిదాలను గుర్తు చేస్తూ, ప్రస్తుత పరిస్థితులపై అసత్య ప్రచారాలు చేయడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ బలహీనంగా ఉన్నట్లు సంకేతాలు వెళ్తాయని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్లమెంట్లో ఏదైనా విషయాన్ని ప్రస్తావించేటప్పుడు కనీస ఆధారాలు ఉండాలి, కానీ రాహుల్ కేవలం ఒక పత్రికా క్లిప్పింగ్‌ను పట్టుకుని జాతీయ భద్రత పేరుతో గందరగోళం సృష్టించడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
రాహుల్‌కు చెప్పేవారే లేరా?
నిజంగా రాహుల్ గాంధీకి దేశ ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే, నియమ నిబంధనలకు లోబడి చర్చకు రావాలని, సభను స్తంభింపజేస్తూ.. అథారిటీ లేని పుస్తకాలను ఉటంకించడం సరికాదని సభా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశాన్ని కాపాడే సైన్యం పట్ల, దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడటం ద్వారా ఆయన తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధమైన రాజకీయం దేశ భద్రతకు గొడ్డలిపెట్టుగా మారకముందే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
