బడ్జెట్ అనేది ఈరోజుల్లో నిర్మాతల చేతుల్లో కూడా ఉండడం లేదు. ముందు ఒక అంకె అనుకొంటారు, ఆ తరవాత అది ఎక్కడికో వెళ్లి ఆగుతుంది. అభిషేక్ నామా సినిమా ‘నాగబంధం’ విషయంలోనూ అదే జరుగుతోంది. నిర్మాతగా సుపరిచితమైన అభిషేక్ నామా ఇప్పుడు దర్శకుడిగా మారారు. ఆయన మెగాఫోన్ పట్టిన సినిమా ‘నాగబంధం’. విరాట్ కర్ణ కథానాయకుడు. ఇది తనకు రెండో సినిమా. ఇది వరకు `పెదకాపు`లో నటించాడు. ఆ సినిమా ఫ్లాప్. అయినా సరే.. ‘నాగబంధం’పై దాదాపు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు టాక్.
నిజానికి ముందు అనుకొన్న బడ్జెట్ రూ.40 కోట్లే. కానీ.. అది కాస్త పెరుగుతూ పోయింది. వీఎఫ్ఎక్స్కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. సెట్స్ కూడా భారీగా ఉన్నాయి. దాదాపు 9 సెట్లు ఈ సినిమా కోసం రూపొందించారు. కేవలం సెట్స్కే రూ.20 కోట్లకు పైగానే ఖర్చయ్యిందని తెలుస్తోంది. టీజర్ రెడీ అయ్యింది. టీజర్లోని విజువల్స్ అబ్బురపర్చబోతున్నాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. టీజర్ చూశాక ఈ సినిమాకి ఇంత ఖర్చు ఎందుకు పెట్టారో అర్థం అవుతుందని చిత్రబృందం అంటోంది. నిజానికి ఓ కొత్త హీరోపై రూ.50 కోట్ల తో సినిమా తీయడమే పెద్ద రిస్క్. అలాంటిది రూ.100 కోట్లు పెట్టారంటే నిర్మాతలు ఎంత పెద్ద రిస్క్ తమ భుజాలపై వేసుకొన్నారో అర్థం అవుతోంది. శివరాత్రి సందర్భంగా మహేష్ బాబు చేతుల మీదుగా ఈ టీజర్ ని విడుదల చేస్తున్నారు. టీజర్ తో మంచి బజ్ వస్తుందని, మార్కెట్ ఓపెన్ అవుతుందని భావిస్తున్నారు. మరి టీజర్ లో బలమెంత? రూ.100 కోట్ల సినిమా అనే విషయంలో నిజమెంత అనేది రేపటిలోగా తేలిపోతుంది.