కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇప్పుడు అందరి దృష్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లింది. 2024 ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు జరిగాయని, కూటమి విజయం వెనుక ఈసీ హస్తం ఉందని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీకి, ఇప్పుడు తన చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం దక్కింది.
వైసీపీ ఆరోపణలు – అసలు సవాల్
2024 అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఈసీ పనితీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఓట్ల లెక్కింపులో తేడాలు ఉన్నాయని, 51 లక్షల ఓట్లపై స్పష్టత లేదని రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు నిలదీశారు. ఇప్పుడు అదే ఈసీపై పక్షపాత వైఖరి, ఎన్నికల మోసం అనే ఆరోపణలతో ఇండియా కూటమి అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చింది. మరి ఈ తరుణంలో వైసీపీ ఆ తీర్మానానికి మద్దతు ఇస్తుందా లేక తటస్థంగా ఉంటుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
నైతికతకు పరీక్ష
బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని వైసీపీ పదేపదే డిమాండ్ చేస్తోంది. ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీని తొలగించే ప్రక్రియలో భాగస్వామి కాకపోతే ఆ పార్టీ చెప్పే విలువలపై సందేహాలు తలెత్తుతాయి. ఒకవేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే లేదా గైర్హాజరైతే, ఎన్నికల అక్రమాలపై ఆ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు ఉండదు. అప్పుడు కూటమి విజయంపై వారు చేసే విమర్శలు కేవలం ఓటమి సాకులు గానే మిగిలిపోతాయి. పార్లమెంట్లో వైసీపీకి ఉన్న బలంతో ఈ తీర్మానం విషయంలో ఆ పార్టీ కీలకం కాదు. కానీ తమ ఓటమికి ఈసీనే కారణమని నమ్ముతున్న వైసీపీకి, ఇప్పుడు సీఈసీని దోషిగా నిలబెట్టేందుకు ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని వాడుకోకుండా మౌనంగా ఉంటే, ప్రజల్లో ఆ పార్టీ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది. పదేపదే ఈవీఎంలను తిడుతూ, సీఈసీకి అండగా నిలబడితే అది ద్వంద్వ నీతి కిందకే వస్తుంది.
నైతిక విలువల్లాంటివి వైసీపీకి ఉండవా?
ఇప్పటికే 193 మంది ఎంపీలు ఈ నోటీసుపై సంతకాలు చేశారు. వైసీపీ ఎంపీలు కూడా దీనికి మద్దతు ఇస్తే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. కానీ, కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాల కోసమో లేక ఇతర రాజకీయ సమీకరణాల వల్లో వైసీపీ వెనుకడుగు వేస్తే.. అది ఆ పార్టీ నైతిక పతనానికి సంకేతం. మరి వైసీపీ అధినేత జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆయన నైతికత ఏంటో ఈ అభిశంసన తీర్మానం తేల్చి చెప్పనుంది. ఇలాంటి నైతికతలకు తాము అతీతం అని ఊరుకుంటారా?
