జాతీయ స్థాయి మీడియా సంస్థలన్నీ అవినీతిమయమైపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జర్నలిస్టు సమాజంలో పెను దుమారం రేపుతున్నాయి. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన రోజున, ఆయన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలుచేశారు. ఆ రోజున పెద్దగాఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడుప్ర ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సహా పలు జర్నలిస్టు సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతుననాయి.
జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని ఐజేయూ సెక్రటరీ జనరల్ డి. సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏచూరి శివ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని జగన్ విమర్శించడం చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తొస్తోందని వారు ఎద్దేవా చేశారు. స్వయంగా ఒక మీడియా సంస్థకు అధినేతగా ఉంటూ, మరోవైపు జాతీయ మీడియాపై ఇటువంటి నిందాపూర్వక వ్యాఖ్యలు చేయడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కొన్ని మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని అణచివేతకు పాల్పడిన జగన్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే ధోరణిని కొనసాగించడం శోచనీయమని జర్నలిస్టు నేతలు పేర్కొన్నారు. మీడియాపై ఆయనకు మొదటి నుండి ఉన్న చులకన భావం ఈ మాటల ద్వారా మరోసారి బహిర్గతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా స్వేచ్ఛను హరించేలా, జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం ఒక మాజీ ముఖ్యమంత్రికి తగదని వారు హితవు పలికారు.
కేవలం తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వార్తలు రాలేదన్న కోపంతో వ్యవస్థలనే కరప్ట్ అని ముద్ర వేయడం ఆమోదయోగ్యం కాదని జర్నలిస్టు సంఘాలు స్పష్టం చేశాయి. తక్షణమే జగన్ మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, మీడియా పట్ల గౌరవంతో వ్యవహరించాలని డిమాండ్ చేశాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న జాతీయ మీడియా సంస్థల ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటం ద్వారా ఆయన తన స్థాయిని తగ్గించుకున్నారని విమర్శించారు.
