తెలంగాణలో రాబోయే గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర కార్పొరేషన్ ఎన్నికలు, ఆ తర్వాతి సార్వత్రిక సమరాలకు పునాది లాంటి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై భారత్ రాష్ట్ర సమితి అధిష్టానం పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. ఓటర్ల జాబితా నమోదు, సవరణల ప్రక్రియపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ఓటర్ల సవరణ ప్రక్రియను అందిపుచ్చుకుని, క్షేత్రస్థాయిలో గులాబీ సైనికులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. విపక్షాల కుట్రలను తిప్పికొట్టేందుకు ఈ సార్ ప్రక్రియే మనకు అత్యంత కీలకమైన ఆయుధమని స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితాలో అధికార పక్షాల అండతో అక్రమాలు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నగరం పరిధిలోని నకిలీ ఓటర్ల సమగ్ర జాబితాను నేనే స్వయంగా మీకు అందిస్తాను. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎన్ని బూగస్ ఓట్లు ఉన్నాయి, డూప్లికేట్ ఎంట్రీలు ఎక్కడ జరిగాయో ప్రతి ఒక్కరూ క్లియర్ గా చూసుకోవచ్చు అని ప్రకటించారు. ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గంలో గ్రౌండ్ లెవల్లో గెలిచే పరిస్థితి లేకపోవడంతో.. భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ లీగల్ గా ఉన్న కొన్ని ఓట్లను అక్రమంగా తొలగించేందుకు లోపాయికారీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కొత్త కొత్త రాజకీయ కథలు అల్లి లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ వ్యూహాల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు అప్రమత్తంగా ఉండి ప్రతి బూత్లోనూ గట్టిగా పహారా కాయాలని ఆదేశించారు.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాలపరిమితిని కేటీఆర్ లీడర్లకు వివరించారు. రాబోయే జూలై 24 వ తేదీ నుండి సెప్టెంబర్ 28 వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను దాఖలు చేయడానికి, కొత్త ఓట్ల నమోదుకు పౌరులకు, రాజకీయ పార్టీలకు పూర్తి సమయం అందుబాటులో ఉంటుందని గుర్తు చేశారు. ఓట్ల తొలగింపు లేదా నకిలీ ఓట్లపై కేవలం నోటి మాటలతో కాకుండా, ఎక్కడికక్కడ రాతపూర్వకంగా ఆధారాలతో సహా ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు.
అక్టోబర్ 1వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా తుది ఓటర్ల జాబితా ను విడుదల చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు. అక్టోబరు 1న వచ్చే ఓటర్ల లిస్టే అత్యంత పవర్ ఫుల్. ఎందుకంటే రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు కూడా ఇదే ఓటర్ల జాబితా వర్తిస్తుంది అని స్పష్టం చేశారు. అంతా ఓకే కానీ.. కేటీఆర్ దగ్గర ఆ నకిలీ ఓట్ల జాబితా ఎలా వచ్చిందబ్బా అని.. బీఆర్ఎస్ నేతలకు చాలా సందేహాలు వచ్చాయి. కానీ తీర్చుకోలేకపోయారు.
