వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే తన పేరు మార్చుకుంటానని రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను.. ముద్రగడ పద్మనాభం సవాల్ తో పోల్చారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని సవాల్ చేసి ఆయన పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకోవాల్సి వచ్చిందని.. ఇప్పుడు మరోసారి అధికారంలోకి వస్తానని చెప్పి రేవంత్ చేస్తున్న పాలన వల్ల.. పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని విశ్లేషించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆర్కే తొలి సారిగా పూర్తి స్థాయి వ్యతిరేకతతో కొత్త పలుకు రాశారు. అయితే మరీ ఘాటుగా కాకుండా.. ఇప్పటికైనా తప్పులు దిద్దుకోవాలన్నట్లుగా ఆయన వ్యాఖ్యానం సాగిపోయింది. గతానుభవాలను వివరిస్తూ.. ముఖ్యమంత్రి మారాలన్న ట్లుగా సలహాలు ఇస్తూ పోయారు. మళ్లీ అధికారంలోకి వస్తానన్న రేవంత్‌కు ఆ నమ్మకం ఉండవచ్చు కానీ..దానికి తగ్గట్లుగా పనితీరు ఉండాలన్నది ఆయన అభిప్రాయం. ప్రస్తుతం ఆ తరహాలో పని తీరు లేదని ప్రజల్లో పెదవి విరుపు పెరిగిపోయిందని అంటున్నారు.
ఆర్కే చెప్పిన సమస్యల్లో ప్రధానమైనవి..పరిపాలనాపరమైన సమస్యలే. ప్రభుత్వంపై రేవంత్ పట్టు సాధించకపోవడం వల్ల సమస్యలు వచ్చినా మంత్రులు నింపాదిగా ఉంటున్నారు. అన్నీ రేవంత్ చూసుకుంటారులే అన్నట్లుగా ఉండటంతో సమస్యలు ముదిరి మీద పడుతున్నాయి. ఆర్టీసీ సమ్మె విషయంలోనూ అదే జరిగింది. ముఖ్యమంత్రి పట్టించుకునే వన్ కదలకపోవడం వల్ల సమస్య ముదిరిపోయింది.. ఓ కార్మికుడు ఆత్మహత్యకు కారణం అయింది. అదే తీవ్ర చర్చనీయాంశం అయింది. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడాన్ని కూడా ఆర్కే గట్టిగానే తప్పు పట్టారు.
గతంలో కేసీఆర్, జగన్ కొన్ని విషయాల్లో చేసిన తప్పులను ఇప్పుడు రేవంత్ రిపిట్ చేస్తున్నారని ఆర్కే అంటున్నారు. చివరికి సమయపాలన కూడా సరిగ్గాలేదని.. ఎవరైనా పెళ్లికి పిలుద్దామని అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వడం లేదని.. ఆర్కే తేల్చేశారు. ఈ వారం ఆర్టికల్ మొత్తం రేవంత్ రెడ్డి గ్రౌండ్ లో పట్టు కోల్పోతున్నారని చెప్పడానికే ఆర్కే ప్రాధాన్యం ఇచ్చారు. అలాగని బీఆర్ఎస్ పుంజుకుంటోందని చెప్పలేదు.. కవిత వల్ల చాలా నష్టపోతుందని మాత్రం తేల్చారు.
