ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన చాణక్య వ్యూహానికి పదును పెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. కేవలం మహిళా సంక్షేమం మాత్రమే కాకుండా, దీని వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు వైసీపీకి ఒక చెక్ మేట్ లా మారాయి. ఈ
బిజేపికి దగ్గరగా.. వైసీపీకి దూరంగా
కేంద్రంలో ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో విపక్షాల అడ్డంకులతో ఆగిపోవడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ తరుణంలో ఏపీ అసెంబ్లీలో ప్రత్యేకంగా ఈ బిల్లుపై చర్చించి విపక్షాలను ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. మహిళా పక్షపాతిగా ఎన్డీయే నిలబడుతుందనే సంకేతం ఇవ్వడం, బిల్లును వ్యతిరేకించిన ఇండి కూటమి మిత్రపక్షాలను ఎండగట్టడం చంద్రబాబు వ్యూహం. ఇది పైకి కనిపించేది .. కానీ అసలు వ్యూహం వేరే ఉంది.
వైసీపీకి అసలైన మాస్టర్ స్ట్రోక్
వైసీపీ మొదటి నుంచీ మహిళా బిల్లుకు మద్దతు ఇస్తోంది. పార్లమెంట్ లోనూ మద్దతుగా ఓటేసింది. వైసీపీ ఇప్పుడు ఇదే అంశంపై అసెంబ్లీకి కు హాజరై.. మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీలకు వ్యతిరేకంగా తమ గళం వినిపించకపోతే.. బీజేపీకి ఆగ్రహం వస్తుంది. వారు కాంగ్రెస్ ను విమర్శించడానికి వ్యతిరేకిస్తున్నారన్న భావన వస్తుంది. అసెంబ్లీకి హాజరైతే.. ప్రజా సమస్యలపై చర్చించడానికి రారు కానీ బీజేపీకి భయపడి.. ఆ పార్టీని సంతృప్తి పరచడానికి వస్తారా అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. ఇది ఆ పార్టీని మరింత చులకన చేస్తుంది. ఏ రకంగా చూసినా వైసీపీకి ఇది మింగుడుపడని వ్యవహారంగా మారింది.
నైతిక బాధ్యత వర్సెస్ రాజకీయ భయం
మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టకపోతే అది బీజేపీ పెద్దలకు తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ, ఈ కీలక సమయంలో బీజేపీకి దూరమవ్వడానికి ఇష్టపడదు. చంద్రబాబు సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకున్నారు. వైసీపీ నాయకులు సభకు వస్తే అది బాబు వ్యూహానికి లొంగినట్లు, రాకపోతే మహిళా వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ద్వారా మహిళలకు చట్టసభల్లో గౌరవం దక్కకుండా విపక్షాలు ఎలా అడ్డుకున్నాయో అనేది ఊరూరా ప్రచారం చేయాలని ఆయన ప్లాన్ చేశారు. దీని కోసం ఇప్పటికే మూడు రాష్ట్ర స్థాయి సదస్సులు, జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు రాజకీయం అంటేనే గజిబిజి లేని వ్యూహం. ఒకవైపు కేంద్రంలోని బీజేపీ అజెండాను రాష్ట్రంలో అమలు చేస్తూనే, మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టడం ఆయనకే సాధ్యం. వచ్చే 10 రోజుల్లో జరగబోయే ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వైసీపీకి ఒక గట్టి పరీక్ష అని చెప్పాలి. సభకు హాజరై తన గళాన్ని వినిపిస్తుందా? లేక దూరంగా ఉండి బీజేపీ ఆగ్రహానికి గురవుతుందా? అన్నది ఆ పార్టీకి పెద్ద సమస్య.
